జాతీయం

Karnataka Politics: కర్నాటకలో సీఎం మార్పు ఊహాగానాలు, ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు!

కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. సీఎం మార్పుపై చర్చ తీవ్రమైన వేళ ఢిల్లీ వేదికగా రాజకీయాలు కొనసాగుతున్నారు.

కర్ణాటక పొలిటికల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. సీఎం మార్పు తప్పదనే వార్తలు వస్తున్న వేళ, ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం సిద్దరామయ్య చెప్పారు. ఈ ప్రకటనపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పలు డీకే సన్నిహితులు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని కలిశారు. మంత్రి చలువరాయస్వామితోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలోనే చక్కెర శాఖ మంత్రి శివానందపాటిల్‌ ఢిల్లీ వెళ్లడం సరికొత్త చర్చలకు దారితీసింది. ఢిల్లీ వెళ్లిన మంత్రులతోపాటు ఎమ్మెల్యేలకు సిద్దరామయ్య నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది.

సిద్ధరామయ్య ఏమన్నారంటే?

అటు మైసూరులో సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. నాయకత్వ మార్పు, కేబినెట్‌ విస్తరణపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని అన్నారు. ఖర్గే బెంగళూరుకు వస్తున్నారని, తాను స్వయంగా వెళ్లి కలుస్తానని అన్నారు. సిద్దరామయ్యకు ఆప్తులుగా పేరొందిన ముఖ్యులు డిన్నర్‌ మీటింగ్‌ నిర్వహించడం సరికొత్త చర్చకు దారితీసింది. మంత్రి సతీశ్‌ జార్కిహొళి తన నివాసంలో విందు ఇచ్చారు.

డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

అటు గ్రూపు రాజకీయాలు తన రక్తంలోనే లేవని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలంతా తనవాళ్లేనని చెప్పారు. తనకు ప్రత్యేకమైన గ్రూపులు, ఆప్తులు లేరన్నారు. సీఎం సిద్దరామయ్య ఐదేళ్లు అధికారంలో ఉంటానన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “చాలా సంతోషం, కాదన్నది ఎవరు?. ఆయనకు మా మద్దతు ఉంటుంది”అని వ్యాఖ్యానించారు. తాను ఎవరినీ ఢిల్లీకి పంపలేదని, తనకు ఆ విషయం తెలీదని అన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ‘‘ఎక్కడైతే కృషి ఉంటుందో.. అక్కడే ఫలితాలు ఉంటాయి. ఎక్కడైతే భక్తి ఉంటుందో.. అక్కడే భగవంతుడు ఉంటాడు’’ ఆసక్తికర పోస్టు పెట్టారు శివకుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button