
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమర్ ను సీఎంగా చూడాలని చాలా మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీకే ఏకంగా ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని ఆలపించారు. వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు ఆశ్చర్యంతో హర్షధ్వానాలు చేశారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలో తొక్కిసలాట ఘటనపై చర్చ సందర్భంగా ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నాయకుడు అశోక్.. శివకుమార్ కు ఆర్‌ఎస్‌ఎస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. దీనికి ప్రతిస్పందనగా డీకే ఆర్‌ఎస్‌ఎస్ గీతం ‘నమస్తే సదా వత్సలే’ అంటూ ఆలపించారు. డీకే ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని ఆలపించడంతో అక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. గట్టిగా బల్లలు చరిచారు.
డీకే బీజేపీలోకి వెళ్తారంటూ ఊహాగానాలు
ప్రస్తుతం డీకే ఆర్ఎస్ఎస్ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం కుర్చీ ఇవ్వకుంటే తాను బీజేపీలో చేరుతానని కర్ణాటక కాంగ్రెస్‌కు డీకే హింట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలో డీకే ఆ ప్రచారానికి తెరదించారు. తాను పుట్టుకతోనే కాంగ్రెస్ వాడినని, జీవితాంతం ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో చేతులు కలిపే ప్రసక్తే లేదని అన్నారు. తాను నికార్సయిన కాంగ్రెస్ వాడినని వ్యాఖ్యానించారు. తన జీవితం, తన రక్తం అన్నీ కాంగ్రెస్ పార్టీకే అంకితమని చెప్పారు. తాను జనతాదళ్, బీజేపీ గురించి ఎలా అధ్యయనం చేశానో, అలాగే ఆర్ఎస్ఎస్ గురించి కూడా తెలుసుకున్నానని డీకే శివకుమార్ చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీపై తనకు అవగాహన ఉందన్నారు. క్షేత్రస్థాయిలో తాలూకా, జిల్లా కేంద్రాల్లో విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తూ ఆర్ఎస్ఎస్ తనను ఎలా బలోపేతం చేసుకుంటుందో తనకు తెలుసని చెప్పారు. రాజకీయంగా తమ మధ్య భేదాభిప్రాయాలు ఉండవచ్చునని, కానీ ఒక నాయకుడిగా తన ప్రత్యర్థుల్లో ఎవరు తనకు మిత్రులో, ఎవరు తనకు శత్రువులో తెలుసుకోకుండా ఉండలేను కదా? అన్నారు.