తెలంగాణ

రాజగోపాల్ రెడ్డికి డీకే శివకుమార్ క్లాస్.. రేవంత్ టీం సంబరం!

సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్న సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన దూకుడు తగ్గించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. తనకు మంత్రిపదవిపై పార్టీ అగ్రనేతలపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా రాజగోపాల్ రెడ్డి ప్రకటనలు చేస్తుంటే.. అది కాస్త ఆయనకు రివర్స్ గా మారినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరికలో కీలక పాత్ర పోషించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా రాజగోపాల్ రెడ్డి విషయంలో హ్యాండ్సప్ అయ్యారని తెలుస్తోంది. అంతేకాదు సీఎం రేవంత్ పై ప్రకటనలు చేయవద్దని వార్నింగ్ ఇచ్చారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు గాడ్ ఫాదర్ గా భావించే కర్ణాటక డిప్యూటీ సీం DK శివకుమార్ ను కలిశారు. జగ్గారెడ్డి కూతురు పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చిన డీకేను రహస్యంగా కలిశారు రాజగోపాల్ రెడ్డి. ఆ సందర్భంగా తనకు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలన్న విషయాన్ని గుర్తు చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపైనా డీకేకు రాజగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అయితే సీఎంపై వరుసగా విమర్శలు చేయడంపట్ల డీకే కూడా రాజ్‌గోపాల్ రెడ్డికి క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది..

మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి రాజ్‌గోపాల్ రెడ్డిలో పెరిగిపోతోంది.తనకు మంత్రి పదవి రాకపోవడానికి సీఎం రేవంత్ రెడ్డినే కారణమని చెబుతున్నారు. అందుకే ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శలను టీపీసీసీ సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. రాజ్‌గోపాల్ వ్యవహారాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా వ్యవహరించారు, మునుగోడు ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించారు.. ఎన్నికలకు ముందు ఏం చేశారు.. ఎన్నికప్పుడు ఏం చేశారో అన్ని వివరాలతో హైకమాండ్ కు నివేదికలు పంపారని తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ పార్టీ పై కుట్ర చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి లాంటివారిని ఉపేక్షిస్తే.. పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని హైకమాండ్‌కు వివరించినట్టు సమాచారం.దీంతో ఆయనపై త్వరలోనే వేటు పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. తరచూ సీఎం రేవంత్‌పై విమర్శలు చేయడంతో ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ, ప్రభుత్వంపై పట్టు సాధించాలంటే ఇదే మంచి చాన్స్ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన మొదట్లో రెబల్స్ గొడవ ఎక్కువగా ఉండేదని.. కానీ ఆయన తన రాజకీయంలో అందర్నీ చుట్టేశారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగించాలని అంటున్నారు. రాజ్‌గోపాల్ రెడ్డికి ప్రధాన బలంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు సైడ్‌అయ్యారు. రాజ్‌గోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో తానేమీ చేయలేనని తేల్చేశారు. దాంతో రాజ్‌గోపాల్‌ రెడ్డికి త్వరలోనే చెక్ పెట్టబోతున్నారని ప్రచారం సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button