
-
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
-
అనారోగ్యంతో కన్నుమూసిన కోట శ్రీనివాసరావు
-
విలక్షణమైన నటనతో అలరించిన కోట
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కోట శ్రీనివాసరావు (83) దివికేగారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున కోట తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కోట తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోట శ్రీనివాసరావు 1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో ఆయనకు రుక్మిణితో వివాహమైంది. కోటకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కోట కుమారుడు ప్రసాద్ 2010లో రోడ్డుప్రమాదంలో చనిపోయారు. కుమారుడు ప్రసాద్ మృతి తర్వాత కోటను కుంగదీసింది. ఇటీవల తన నివాసానికి వెళ్లి పలువురు ప్రముఖులు ఆయన్ని పరామర్శించారు. కోట చాలా నీరసంగా, కుచించుకుపోయి కన్పించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న కోట ఇవాళ ఉదయం చనిపోయినట్లు బంధువులు ప్రకటించారు. సినిమాల్లోకి రాకముందు కోట స్టేట్ బ్యాంకులో పనిచేశారు.
విలక్షణ నటనకు మారుపేరు కోట
తెలుగు చిత్రసీమలో విలక్షణమైన నటుడిగా కోట శ్రీనివాసరావు పేరుతెచ్చుకున్నారు. ఆయన ఏ వేషం కట్టినా తెలుగు ప్రేక్షకులను రంజింపజేశారు. ముఖ్యంగా బాబుమోహన్, బ్రహ్మానందంతో కోట కాంబినేషన్ అదుర్స్ అనే చెప్పాలి. నాలుగు దశాబ్దాల కోట ప్రయాణంలో 750 చిత్రాలకు పైగా ఆయన నటించారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏ పాత్రలోనైనా ఆయన ఇట్టే ఒదిగిపోయేవారు.
విలన్ వేషానికి కోట తన నటనతో కొత్త భాష్యం చెప్పారు. రంగస్థల నటుడిగానూ ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించారు కోట. ప్రాణం ఖరీదు సినిమాతో కోట తెలుగు తెరకు పరిచయమయ్యారు. తొలినాళ్లలో సహాయ నటుడిగా, విలన్‌గా ఆకట్టుకున్నారు. తెలుగు అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేష్‌బాబు, పవన్, తదితర నటులతో స్క్రీన్‌ను పంచుకున్నారు కోట. సాయిధరమ్ తేజ్ వంటి నూతన నటులతోనూ కోట కలిసి పనిచేశారు. ప్రతిఘటన సినిమాతో తెలుగు చిత్రసీమలో కోట పేరు మారుమోగిపోయింది. అహనా పెళ్లంటలో పిసినారి పాత్రలో నటించిన కోటకు తిరుగులేని నటుడిగా పేరొచ్చింది. యముడికి మొగుడు, బొబ్బిలిరాజా, యమలీల, శివ, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు కోట.
కోటకు పవన్ సంతాపం
కోట శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కోట మృతి సినీరంగానికి తీరని లోటన్నారు ప్రముఖసినీ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాఖ్. ప్రాణంఖరీదు సినిమాతో అన్నయ్య చిరంజీవితో కలిసి కోట సినీ ప్రయాణం మొదలుపెట్టారని పవన్ గుర్తుచేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి కోట ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామన్నారు పవన్.
కోట కూలిపోయింది
కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్, ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి సంతాపం తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు కోట చేసిన సేవలను పలువురు కొనియాడారు.
కోట భౌతికకాయాన్ని చూసి బోరున విలపించిన బ్రాహ్మానందం
కోట భౌతికకాయానికి బ్రహ్మానందం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన బోరున విలపించారు. కోట మృతిని నమ్మలేకపోతున్నానన్నారు బ్రహ్మానందం. నటన ఉన్నంత కాలం కోట ప్రజల్లో జీవించే ఉంటారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.