Cyclone Ditva Updates: బంగాళాఖాతంలో బలంగా కొనసాగుతున్న వాయుగుండం దిశను మార్చుకుంది. చెన్నైకి అతి సమీపంలో ఉన్న వాయుగుండం ఉత్తరంగా పయనించేందుకు వాతావరణం అనుకూలించలేదు. మధ్యాహ్నం సమీపంలో దక్షిణ నైరుతి వైపు దిశ మార్చుకుని ఉత్తర తమిళనాడు వైపు మళ్లింది. ఇవాళ ఉదయంలోగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడు, కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వైపు వెళ్లనుంది. పడమర వైపు నుంచి బలమైన గాలులు వీయడంతో నెమ్మదిగా పయనిస్తూ దిశ మార్చుకుందని అధికారులు వెల్లడించారు.
సీమ, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు
వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, కోస్తాల్లో ఎక్కువచోట్ల వర్షాలు, కొన్నిచోట్ల భారీవర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా మల్లాంలో 9.65, చిట్టుమూరులో 9.575, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 9.2, తిరుపతి జిల్లా అల్లంపాడులో 7.2, తడలో 5.9, పూలతోటలో 5.8, ఏలూరు జిల్లా కాకర్లమూడిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది.
దిత్వా దెబ్బకు 465 మంది మృతి
అటు దిత్వా తుఫాన్ శ్రీలంకలో పెను విషాదాన్ని నింపింది. భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడి ఇప్పటి వరకు 465 మంది చనిపోయినట్లు లంక ప్రభుత్వం తెలిపింది. మరో 366 మంది ఆచూకీ గల్లంతు అయినట్లు వెల్లడించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది. దిత్వా తుఫాన్ తో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్ సహా పలు దేశాలు మానవతా సాయం అందిస్తున్నాయి. దిత్వా ప్రభావం తమిళనాడుపైనా తీవ్రంగా పడింది. ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.





