
Dinosaur-Era Fossils: భారత్ లో డైనోసార్లు సంచరించాయనే వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పరిశోధకులు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో డైనోసార్ల సంచారానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు కూడా. తరచుగా వీటిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా డైనోసార్ల సంచారానికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ లో డైనోసార్లు తిరగాడినట్లు గుర్తించారు. ఈ మేరకు డైనోసార్ కు సంబంధించిన శిలాజాలను గుర్తించారు.
180 మిలియన్ ఏండ్ల నాటి డైనోసార్ శిలాజంగా గుర్తింపు
మేఘ గ్రామంలో డైనోసార్లు సంచరించినట్టు కొందరు పరిశోధకులు తాజాగా గుర్తించారు. దాదాపు 180 మిలియన్ సంవత్సరాల క్రితం జురాసిక్ యుగం నాటి వెన్నెముక గల జంతు జాతి శిలాజాన్ని కనుగొన్నారు. రాజస్థాన్‌లోని మేఘ గ్రామంలో డైనోసార్లు సంచరించినట్టు వెల్లడించారు.ఈ ఆవిష్కరణ జైసల్మేర్ భౌగోళిక చరిత్రపై ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అంతేకాకుండా పరిశోధన, పర్యాటక రంగాలకు కొత్త మార్గాలను తెరుస్తుందని భావిస్తున్నారు. “ఇది వెన్నెముక గల జంతు జాతి శిలాజం. వెన్నెముక మొత్తం భాగాలను ఇందులో చూడవచ్చు. దీని వయసుపై దాదాపు అంచనాకు వచ్చాం. పరిశోధనలో పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ డైనోసార్లు రాజస్థాన్ లో ఏ ప్రాంతాల్లో తిరిగాయి అనే విషయంలోనూ లోతైన విశ్లేషణ కొనసాగుతోంది. ఈ శిలాజం దొరకడం కీలక అంశాలను పరిశోధించడానికి ఉపయోగపడుతుంది’ అని సీనియర్ హైడ్రో జియాలజిస్ట్ నారాయణ దాస్ ఇనాఖియా వెల్లడించారు.