
Dharmasthala Case: కర్ణాటక ధర్మస్థలలో మృతదేహాల కోసం సిట్ అధికారులు త్వకాలు జరపుతున్నారు. మూడో రోజు ఓ అస్థిపంజరం బయటపడింది. ధర్మస్థలలో వందలాది మృతదేహాలను పూడ్చినట్లు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులు ఐదు ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో మృతదేహాలు కనిపించలేదు. మూడో రోజు నేత్రావతి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఓ అస్థిపంజరం లభించింది. కొన్ని ఎముకలు, పగిలినట్లు ఉన్న పుర్రె బయటపడ్డాయి. ఫోరెన్సిక్ నిపుణులు అస్థి పంజరాన్ని పరిశీలిస్తున్నాయి. అది పురుషుడిదని ప్రాథమికంగా గుర్తించారు. ఎస్పీ జితేంద్రకుమార్ దయా, పుత్తూరు ఏసీపీ స్టెల్లావర్గీస్ తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు. ఇంకా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇంతకీ అసలు ఏం జరిగింది?
దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ప్రముఖ శైవ క్షేత్రం. నిత్యం ఇక్కడికి ఎంతో మంది భక్తులు తరలి వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు.. ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని చెప్పాడు. వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారంతా లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు చెప్పాడు. 2014లో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండడంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ వ్యక్తి పోలీసులకు వివరించాడు. మృతదేహాలను ఎవరు పూడ్చి పెట్టమన్నారు? వాటిని ఎవరి సహాయంతో తీసుకెళ్లారు? అనే అంశాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయన చెప్పింది నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు.
Read Also: శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద, సాగర్ లోకి కృష్ణమ్మ పరుగులు!