మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌సిసోడియా, కల్వకుంట్ల కవితతో పాటు మద్యం కుంభకోణం కేసులో 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, ఈ తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఎలాంటి నేరపూరిత ఉద్దేశం కానీ, కుట్ర కానీ లేదని.. సీబీఐ సమర్పించిన సాక్ష్యాలు న్యాయ పరీక్షకు నిలవవని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి జితేంద్రసింగ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని, హవాలా మార్గంలో నిధుల బదిలీకి సాక్ష్యాధారాలున్నాయని, కుంభకోణంలో పాత్రధారులు పలుమార్లు కలిశారని తాము సాక్ష్యాలతో పేర్కొన్న కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ భావిస్తోంది. ఈ కేసులో మరింత దర్యాప్తు జరపాల్సి ఉందని సీబీఐ హైకోర్టు ముందు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి జితేంద్ర కీలక తీర్పు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి జితేంద్ర ప్రతాప్ సింగ్ వెలువరించిన 598 పేజీల తీర్పు రాజకీయ, న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకే అక్షరజ్ఞానం లేదని.. అభూతకల్పనలు, తప్పుడు సాక్ష్యాధారాల అధారంగా తన చార్జ్‌షీట్‌ను రూపొందించిందని ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.
ఇంతకీ ఎవరీ జడ్జి జితేంద్ర ప్రతాప్ సింగ్!
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి జితేంద్ర సింగ్ లా డిగ్రీ పొందారు. ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ లో సీనియర్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2024 అక్టోబరు నుంచి రౌస్ అవెన్యూ కోర్టు అదనపు సెషన్స్ జడ్జిగా కొనసాగుతున్న ఆయన.. ప్రత్యేక జడ్జి కింద అవినీతి నిరోధక చట్టానికి సంబంధించిన సీబీఐ కేసులను విచారిస్తున్నారు. జితేంద్ర సింగ్ ఎలాంటి ప్రలోభాలకు లొంగరని, చట్టం విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారని పేరుపొందారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి కేవలం అప్రూవర్ల ప్రకటనల ఆధారంగా సీబీఐ లాంటి సంస్థ కేసును నిర్మించినందుకు తీవ్రంగా విమర్శించారు. నిర్మాణాత్మక సాక్ష్యాలేవీ లేకుండా సీబీఐ కథలు అల్లిందని, అప్రూవర్ల మాటలనే వేదంగా భావించిందని.. ఇలా ఆధారపడడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని ఆక్షేపించారు. మొత్తం సీబీఐ పరిశోధన జరిపిన తీరునే తప్పుబట్టిన జితేంద్ర సింగ్.. సీబీఐ పరిశోధనాధికారిపైనే శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారు.
