NIA Investigation: ఢిల్లీలో జరిగిన బాంబుదాడి కేసు విచారణను ఎన్ఐఏ అధికారు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కీలక సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో ఆత్మాహుతికి పాల్పడిన ఉమర్ గదిని ఎన్ఐఏ అధికారులు చెక్ చేశారు. ఇందులో పేలుడుకు ముందు ఉమర్ రికార్డు చేసిన ఓ వీడియో గుర్తించారు. ఇందులో ఆత్మాహుతి దాడికి సంబంధించిన షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆత్మాహుతి దాడిని అపార్థం చేసుకుంటున్నారని, అదో బలిదానం అని చెప్పే ప్రయత్నం చేశాడు. చనిపోయే స్థలం, సమయం, పరిస్థితుల గురించి కూడా ఉమర్ అందులో వివరించాడు. నవంబర్ 9న అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉమర్ ఈ వీడియోను రికార్డు చేసినట్లు అధికారులు గుర్తించారు. తర్వాత రోజుఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు ఉమర్‌కు సహకరించిన అతడి బంధువుతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నాయి.
రాకెట్ దాడులు విఫలం కావడంతో..
ఫరీదాబాద్ డాక్టర్ టెర్రరిస్టులు దేశంలో కొత్త తరహా దాడులకు కుట్ర చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఉమర్ నబీ అనుచరుడు జాసిర్ బిలాల్ వనిని అరెస్ట్ చేసిన అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఈ ముఠా ఢిల్లీ సహా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా రాకెట్ దాడులకు ప్లాన చేసినట్లు వెల్లడించాడు. గాజాలోని హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై చేసే దాడులతో వీరు స్ఫూర్తి పొందినట్లు వివరించాడు. ఢిల్లీలో కీలకమైన ప్రాంతాల్లో రాకెట్ దాడులు చేసి మారణహోమం సృష్టించాలనుకున్నట్లు తెలిపాడు. రాకెట్లు తయారుచేసి డ్రోన్లకు అమర్చి పేల్చే ప్రయోగాలు కూడా చేసినా, అవి సక్సెస్ కాకపోవడంతో, ఆత్మాహుతి దాడులను ఎంచుకున్నట్లు తెలిపాడు.
అల్ ఫలాహ్ వ్యవస్థాపకుడి అరెస్ట్
అల్ ఫలాహ్ వర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్దిఖీని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అతడిపై కేసు నమోదుచేసి, అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అల్ ఫలాహ్ వర్సిటీతోపాటు జావేద్ నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 9 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు.





