
తాజాగా ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటన తర్వాత కశ్మీర్ లోని వైద్యులు, దేశంలోని పలు విద్యాసంస్థల్లో చదువుతున్న కశ్మీరీ విద్యార్థులపై దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టడంపై మ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తుల చేసిన ఉద్రవాద కార్యకలాపాలకు కశ్మీరీ ప్రజలందరిని ఉగ్రవాదులుగా చూడటం సరికాదన్నారు. ఎక్కడ తమను బాధ్యులను చేస్తారోననే భయంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా కశ్మీర్ ప్రజలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
“ఢిల్లీలో జరిగిన దాడికి కొద్ది మంది బాధ్యులు. కానీ, కశ్మీరీలు అంతా బాధ్యులమనేలా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఆ బాంబు దాడి ఢిల్లీలో జరగకుండా ఉంటే, కశ్మీర్ లో జరిగి ఉండేది. కశ్మీర్‌లో ఎంతో రక్తపాతం చూశాం. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లలను కశ్మీర్ బయటకు పంపేందుకు తల్లిదండ్రులెవరూ ఇష్టపడం లేదు. ప్రతిచోటా జనం కశ్మీరీలను అనుమానంగా చూస్తున్నారు” అని ఒమర్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, జమ్మూకశ్మీర్‌లో రిజిస్టర్ అయిన కారుతో ఢిల్లీకి వెళ్తే అది కూడా ప్రస్తుతం నేరంగా పరిగణిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను కూడా జమ్మూకశ్మీర్ నెంబర్ ఉన్న వాహనంతో ఢిల్లీకి వెళ్లాలంటే ఎక్కడ ఆపి తనిఖీలు చేస్తారోనని భయపడుతున్నట్టు చెప్పుకొచ్చారు.
ఉగ్రవాదులకు మద్దతుగా ఫరూక్ వ్యాఖ్యలు
అటు ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా తండ్రి, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డాక్టర్లు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. ఇందుకు బాధ్యులను ఈ ప్రశ్నలు అడగాలన్నారు. భారత్-పాక్ తమ సంబంధాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. దేశంలో మళ్లీ ఉగ్రదాడుల నేపథ్యంలో మరో ఆపరేషన్ సిందూర్ ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.





