
Texas Floods: అమెరికాలోని టెక్సాస్ లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడ చూసి వరదలు విలయ తాండవం చేస్తున్నాయి. భారీ వరదల్లో చిక్కుకుని ఇప్పటి వరకు ఏకంగా 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కెర్ కౌంటీలోని గ్వాడలూప్ నది సమీపంలోనే 59 మంది మృత్యువాతపడ్డారు. మృతులలో 21 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న గ్వాడలూప్ నది
గత కొద్ది రోజులులగా కెర్ కౌంటీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గ్వాడలూప్ నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని తోటత్తు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నదీ తీరంలో ఉన్న శిక్షణ శిబిరాలను వరద ముంచెత్తింది. ఈ శిబిరాల్లో శిక్షణ తీసుకుంటున్న 27 మంది బాలికలతో సహా మిగిలిన వారు గల్లంతయ్యారు. వారి కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
నీట మునిగిన వందలాది నివాసాలు
కెర్ కౌంటీలోని పలు ప్రాంతాల్లో వరదల ధాటికి వందలాది నివాసాలు నీట మునిగాయి. పదుల సంఖ్యలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న దాదాపు 850 మందిని రక్షించినట్లు సహాయక బృందాలు ప్రకటించాయి. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు కెర్ కౌంటీ అధికారులు తెలిపారు. వీలైనంత వరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు.
ముంపు ప్రాంతాల్లో ట్రంప్ పర్యటన
అటు భారీ వరదలతో అతలాకుతలం అయిన కెర్ కౌంటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా వీక్షించనున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. మరోవైపు టెక్సాస్ వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ సానుభూతి తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
Read Also: ఇవాళ భారీ, రేపు అతి భారీ వర్షాలు, ఏ జిల్లాల్లో అంటే?