
Suravaram Sudhakar Reddy: సీపీఐ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు ఉద్యమంలో ఓ శకం ముగిసినట్లయింది. సురవరం సతీమణి విజయలక్ష్మిని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పరామర్శించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, మాజీ సీఎం కేసీఆర్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలు పార్టీల నేతలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
సురవరం సుధాకర్ రెడ్డి గురించి..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో 1942 మార్చి 25న సుధాకర్‌రెడ్డి జన్మించారు. కర్నూల్‌లోని మున్సిపల్ హైస్కూల్, కోల్స్ మెమోరియల్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం చేసి, 1964లో కర్నూల్‌లో బీఏ (హిస్టరీ) చదివి, 1967లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 15 ఏళ్ల వయసులోనే కర్నూల్‌లోని తన స్కూల్‌లో బ్లాక్‌బోర్డులు, చాక్‌పీసులు, పుస్తకాల కోసం ఆందోళనలో కీలక పాత్ర పోషించారు. 1960లో ఏఐఎస్‌ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆతర్వాత కర్నూలు జిల్లా కార్యదర్శిగా పని చేశారు.1965లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1966లో ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధానకార్యదర్శి అయ్యారు. 1969లో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. 1970లో ఏఐఎస్‌ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్‌నకు జాతీయ అధ్యక్షుడయ్యారు.
సురవరం సుధాకర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం..
1971లో సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడయ్యారు. 1974లో తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన సురవరం ఆనాటి నుంచి 1984 వరకు సీపీఐ ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1985, 90లో కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 1994లో కర్నూలులోని డోన్‌లో సీఎం విజయభాస్కర్ రెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. 1998లో నల్లగొండ పార్లమెంట్ నుంచి ఎన్నికయ్యారు. ఇదే సంవత్సరం ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో విద్యుత్ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన పోరాటంలో సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్యపాత్ర పోషించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచే రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే సురవరం కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ అయ్యారు. 2007లో హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ జాతీయ మహాసభల్లో ఉప ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012 పట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో పార్టీ ప్రధానకార్యదర్శిగా నియమితులయ్యారు. చండ్రరాజేశ్వరరావు తరువాత జాతీయ ప్రధానకార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు.
గాంధీ ఆసుపత్రికి సురవరం మృతదేహం
సురవరం సుధాకర్‌రెడ్డి మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం హిమాయత్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 నుంచి 3 గంటల వరకు ఉంచనున్నారు. అనంతరం సీపీఐ కార్యాలయం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీగా వెళ్లి సురవరం భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రికి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.