
కొడుకు పుట్టాలని కలలు కంటూ ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఓ దంపతుల కథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ మహిళ ప్రతి సారి ప్రసవించినప్పుడు ఆడపిల్లే పుట్టడంతో కుటుంబంలో ఆశలు నెరవేరలేదు. అయినా కూడా కుమారుడి కోరిక మాత్రం తగ్గలేదు. ఇలా వరుసగా 10 మంది కూతుళ్లకు జన్మనిచ్చిన ఆమె.. చివరికి 11వ కాన్పులో కుమారుడిని కంటికి చూపించింది. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఇన్నేళ్ల తర్వాత దేవుడు తమను కరుణించాడంటూ సంబరాలు చేసుకుంటోంది.
హరియాణాలోని జింద్ జిల్లా ఉచానా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇప్పటికే 10 మంది కూతుళ్లు ఉన్నప్పటికీ, మగబిడ్డ కావాలన్న కోరికతో దంపతులు ఏళ్లపాటు నిరీక్షించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకవైపు సంతానం కోసం ఎంతో మంది దంపతులు ఎదురుచూస్తుంటే, మరోవైపు ఇంత పెద్ద కుటుంబం ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ 11వ గర్భధారణ తల్లి బిడ్డ ఇద్దరికీ అత్యంత ప్రమాదకరంగా మారింది. మహిళ తీవ్ర రక్తహీనతతో బాధపడుతుండగా, శిశువు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ప్రసవం అనంతరం ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
ఈ ఘటనపై తండ్రిని సంప్రదించగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. తన పెద్ద కుమార్తె ఇంటర్ చదువుతోందని, రెండో కుమార్తె టెన్త్‌లో ఉందని చెప్పిన ఆయన.. మిగిలిన కూతుళ్ల పేర్లు గుర్తు లేవని అనడం విమర్శలకు కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ALSO READ: సర్పంచుల ఫోరం అధ్యక్షునికి శుభాకాంక్షలు : మాజీ సర్పంచ్





