ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ప్రశ్నార్థకంగా రాజ్యాంగం: వైఎస్‌ జగన్‌

  • రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో భయానక వాతావరణం

  • ఎవరికి కష్టం వచ్చినా వైసీపీ స్పందిస్తుంది: జగన్‌

  • ఏడాది పాలనలో చంద్రబాబు ఒక్క హామీ నెరవేర్చలేదు

  • సూపర్‌ సిక్స్‌ హామీని తుంగలో తొక్కారు: జగన్‌

  • మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుంది

  • మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే: వైసీపీ అధినేత జగన్‌

క్రైమ్‌ మిర్రర్‌, అమరావతి: ఏపీలో రాజ్యాంగం ప్రశ్నార్థకమైందని, రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి కష్టం వచ్చినా వైసీపీ స్పందిస్తోందని జగన్‌ భరోసా కల్పించారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని, ఏడాది కూటమి పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. సూపర్‌ సిక్స్‌ సహా ఇచ్చిన 143 హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వసతి దీవెన ఇవ్వకపోవడంతో విద్యార్థులు చదువులు మధ్యలోనే నిలిపివేసి, పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు జగన్‌. నిరుద్యోగ భృతి ఏమైందో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. ఏడాదిలో కరెంట్‌ చార్జీల రూపంలో ప్రజలపై రూ.15వేల కోట్ల భారం వేశారన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరన్నారు జగన్‌. రైతు భరోసా ఏమైందో చెప్పాలన్నారు. ప్రతి మహిళకు రూ.18వేలు ఏమైదని జగన్‌ ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఏడాదికి రూ.36వేలు, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, 50ఏళ్లు దాటినవారికి పెన్షన్లు, ఉచిత బస్సు, వైద్యం హామీలు ఏమయ్యాయని కూటమి ప్రభుత్వంపై జగన్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని… మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని జగన్‌ జోస్యం చెప్పారు. ఏపీలో దుర్మార్గపు పాలన నడుస్తోందని, తన మోచేతి నీళ్లు తాగే అధికారులనే దగ్గర పెట్టుకున్నారని అన్నారు. డీజీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రశ్నించిన ప్రజల గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు జగన్‌. మంచిమంచి అధికారులందరూ ఏపీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారని జగన్‌ అన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని, కొందరు చేతిలో అధికారం ఉందని శాడిస్టుల్లా వ్యవహరిస్తున్నారని జగన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇవి చదవండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button