బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేందుకు కుట్ర జరిగిందన్న వార్తలు రావడంతో హైదరాబాద్ లో కలకలం రేపుతున్నాయి. రాజాసింగ్ ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ నివాసం దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పట్టుకున్న స్థానికులు మంగళహాట్ పోలీసులకు అప్పగించారు. వీరిని ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా గుర్తించారు పోలీసులు. పోలీసులకు అప్పగించిన ఇద్దరి ఫోన్లలో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజాసింగ్ ను హత్య చేసేందుకే ఈ ఇద్దరు వచ్చారని ఆయన అభిమానులు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.
గతంలోనూ రాజాసింగ్ హత్యకు పన్నని పన్నాగాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. గుజరాత్ లోని సూరత్ నగరంలో జరిగిన సోదాల్లో ఒక మౌళ్వీ ని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ , నేపాల్ లో కొందరు నుంచి వస్తున్న ఆదేశాల ఆధారంగా ఈ కుట్ర అమలు చేస్తున్నట్లుగా సూరత్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ హత్య కోసం కోటి రూపాయల సుపారిని ఆఫర్ చేసినట్లు వివరించారు. పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా మారణాయుధాలు అందించేటట్లుగా ఒప్పందం కుదిరినట్లు గతంలో సూరత్ పోలీసులు గుట్టురట్టు చేశారు.