జాతీయం

Rahul Gandhi: ప్రోటోకాల్ వివాదం.. రాహుల్‌కు మూడో వరుసలో సీటుపై కాంగ్రెస్ ఫైర్!

ఢిల్లీ కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను చూసేందుకు విపక్ష నేతలకు కేటాయించిన సీట్ల కేటాయింపుపై రగడ జరుగుతోంది. రాహుల్ కు మూడో వరుస సీట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

కర్తవ్యపథ్‌లో నిర్వహించిన 77వ రిపబ్లిక్ వేడుకల్లో ప్రోటోకాల్ పాటించలేదంటూ కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రోటోకాల్ ప్రకారం లోక్‌సభలో విపక్ష నేతకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉండగా, రాహుల్‌కు మూడో వరుసలో సీటు కేటాయించడాన్ని తప్పుపట్టింది. తమ వాదనకు బలం చేకూరుస్తూ.. 2014లో సీట్ షేరింగ్ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మూడో వరుసలో సీట్ల కేటాయింపు

రిపబ్లిక్ వేడుకల్లో రాహుల్‌తో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. వారికి మూడో వరుసలో సీటు కేటాయించారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా కేంద్రంపై విమర్శలు కురిపించారు.  దేశ విపక్ష నేత విషయంలో అనుసరించాల్సిన సంప్రదాయం, ప్రొటోకాల్ ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆత్మన్యూనతలో కూరుకుపోయందన్నారు. ప్రభుత్వ అసహనాన్నే ఈ చర్య చాటుతోందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.

అప్పట్లో అలా.. ఇప్పుడు ఇలా..

రాహుల్ గాంధీని బీజేపీ ఉద్దేశపూర్వకంగానే అవమానించిందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠూగూర్ ఆరోపించారు. 2014లోని ఒక ఫోటోను ఆయన షేర్ చేశారు.  ఎల్‌కే అద్వాణీ ఎక్కడ కూర్చున్నారో చూడండి. అప్పుడు లేని గందరగోళం ఇప్పుడు ప్రోటోకాల్ విషయంలో ఎందుకు సృష్టిస్తున్నారు? ఖర్గే, రాహుల్‌ను అవమానించాలన్నదే మోడీ, షాల ఉద్దేశమన్నారు. 2014లో ఎల్‌కే అద్వానీ అటు రాజ్యసభలో కానీ, ఇటు లోక్‌సభలో విపక్ష నేతగా లేరు. అయినప్పటికీ రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీతో కలిసి ఆయనకు ముందు వరుసలో సీటు కల్పించారు. అప్పట్లో సుష్మాస్వారాజ్ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాగా, కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర అధికారికంగా ఇంకా స్పందించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button