జాతీయం

Shashi Tharoor: ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్, బీజేపీలోకి శశిథరూర్?

కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ ఆపార్టీకి అవకాశం కనిపిస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి తాజాగా ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే నేతృత్వంలో నిర్వహించిన ముఖ్య సమావేశానికి ఆయన డుమ్మాకొట్టారు. అయితే, కొజికోడ్‌లో జరిగే  కేరళ సాహిత్య ఉత్సవానికి హాజరు కావాల్సి ఉన్నందునే థరూర్‌ రాలేక పోయారని ఎంపీ కార్యాలయం తెలిపింది.

రాహుల్ అవమానించినందుకే!

మరోవైపు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తనను అవమానించారని శశి థరూర్‌ భావిస్తున్నారు. ఈ నెల 19న తన సొంత నియోజకవర్గం తిరువనంతపురంలో కాంగ్రెస్‌ పార్టీ  మహా పంచాయతీ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. దీనిలో పాల్గొన్న రాహుల్‌.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వేదికపై శశిథరూర్‌ ఉన్నప్పటికీ.. ఆయనను కనీసం పలకరించకపోవడం, ఇతర నేతల పేర్లను ప్రస్తావించి.. ఆయనను విస్మరించడంతో శశి అలకబూనారని తెలుస్తోంది.

ఏడాదిగా పార్టీ లైన్ కు భిన్నంగా వ్యవహరిస్తున్న శశి

వాస్తవానికి థరూర్‌ కూడా ఏడాది కాలంగా కాంగ్రెస్‌ పార్టీ లైన్‌కు భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. ఎన్నోసార్లు మోదీని పొగిడారు. ఈ పరిణామాల నేపథ్యంలో శశిథరూర్‌ కాంగ్రెస్‌ పార్టీని వదిలేస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. త్వరలోనే కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ చర్చకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆయనంతట ఆయన పార్టీని వదిలేయకుండా.. పార్టీనే ఆయనను బయటకు పంపించేలా వ్యవహరిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారని చెబుతున్నారు. ఒకవేళ ఆయన పార్టీ నుంచి బయటకు వస్తే, కచ్చితంగా బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఆయనకు మంచి పొజిషన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button