
వ్యవస్థీకృత జీఎస్టీ ఎగవేతలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) హైదరాబాద్ అధికారులు గట్టి చర్యలకు దిగారు. డాటా అనలిటిక్స్‌తో పాటు ఇతర దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుని సేకరించిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా, అంతర్రాష్ట్ర స్థాయిలో మోసపూరిత జీఎస్టీ నెట్‌వర్క్‌లను నడుపుతున్న ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లోనూ, వ్యాపార రంగంలోనూ పెద్ద చర్చకు దారితీసింది.
ఈ కేసులో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, ఒక నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సునీల్‌కుమార్ అరెస్టు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అధికారుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం.. వినియోగదారుల నుంచి వసూలు చేసిన సుమారు రూ.28.24 కోట్ల జీఎస్టీ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఈ మొత్తం వ్యవస్థీకృతంగా మళ్లించబడినట్టు డీజీజీఐ అధికారులు నిర్ధారించారు.
ఇదే కేసులో మరో కీలక నిందితుడిగా ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ చేతన్ ఎన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన సుమారు రూ.22 కోట్ల విలువైన నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను సృష్టించి, జీఎస్టీ వ్యవస్థను మోసం చేసినట్టు దర్యాప్తులో తేలింది. నకిలీ ఐటీసీల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ రెండు కేసుల్లోనూ నేరాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టం 2017లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం ఇద్దరినీ అరెస్టు చేశారు. జీఎస్టీ ఎగవేతలపై ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడదని, రాజకీయ నేపథ్యం లేదా ఆర్థిక బలాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీజీఐ స్పష్టం చేసింది. ఈ అరెస్టులతో జీఎస్టీ మోసాలపై దేశవ్యాప్తంగా కఠిన చర్యల సంకేతం ఇచ్చినట్లయింది.
ALSO READ: VIDEO: ఫోటో తీస్తావా? అంటూ .. NTR ఆగ్రహం





