
తెలంగాణ కాంగ్రెస్ లో సంచలన పరిణామాలు జరగబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తరహాలానే రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టీపీసీసీ క్రమశిక్షమా సంఘం చైర్మెన్ మల్లురవి పరోక్షంగా ఇదే సంకేతం ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి ప్రకటనలపై ఆయన నుంచి వివరణ తీసుకుంటామని.. అనంతరం యాక్షన్ ఉంటుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ మల్లు రవి అత్యంత సన్నిహితుడు కావడంతో… రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదనే చర్చే సాగుతోంది.
తెలంగాణ మంత్రివర్గంలో చోటు ఆశించారు రాజగోపాల్ రెడ్డి. తాను బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడే మంత్రిపదవి ఇస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు. హైకమాండ్ ఇచ్చిన మాటను అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా వాయిస్ పెంచారు. బహిరంగంగానే తన అక్రోసం వెళ్లగక్కుతున్నారు. మంత్రపదవి తనకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మంత్రి పదవి కోసం ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం తనకు లేదంటూనే.. తనకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ విషయంలోనే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.
పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లను తప్పుపడుతూ ట్వీట్ చేసి సంచలనం స్పష్టించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆ మంటలు కొనసాగుతుండానే సోషల్ మీడియా, డిజిటల్ జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సోషల్ మీడియా మద్దతుతోనే గెలిచిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అహంకారంతో మాట్లాడటం ఏంటని నిలదీశారు. అంతేకాదు డిజిటల్ మీడియా జర్నలిస్టులతో తన ఇంట్లో సమావేశం నిర్వహించి మరోసారి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముందు తన భాష మార్చుకోవాలని సూచించారు. తిట్లు తిట్టడం మానేసి ఇచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మరో అడుగు ముందుకేసి రోజూ తన మీడియాలో రేవంత్ రెడ్డిని తిడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. వరుస పరిణామాలతో రేవంత్ టీం రాజగోపాల్ రెడ్డిపై గుస్సాగా ఉంది. దీంతో రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేలా రేవంత్ టీమ కసరత్తు చేస్తుందని తెలుస్తోంది.