తెలంగాణ

స్థానిక ఎన్నికలు లేనట్టేనా..? రిజర్వేషన్ల వివాదంతో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ

క్రైమ్ మిర్రర్, ఇన్వెస్టిగేషన్:- తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం మొదలవుతుందనుకున్న తరుణంలోనే రిజర్వేషన్ల వివాదం మరోసారి అడ్డంకిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.9 ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు సాగిన తర్వాత, హైకోర్టు విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా కోర్టు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినా, ఈ పిటిషన్ కొనసాగుతుందనే షరతు ను విధించడం గమనార్హం. దీంతో, షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Read also : ఈ సినిమా చూసి మనోళ్లు సిగ్గుపడాలి… మిగతా వాళ్ళకి హ్యాట్సాఫ్ : ఆర్జీవి

ఇక మరోవైపు, బీసీ రిజర్వేషన్లను 42%గా పెంచిన ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం కోర్టులో కూడా సవాల్‌ ఎదురవుతోంది. వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించి, జీవో నం.9ను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 67%కు చేరతాయని, ఇది ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన 50% పరిమితి తీర్పులకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని 50% శాతం మించరాదు అనే నిబంధనను తొలగిస్తూ చేసిన సవరణ ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదని కూడా గుర్తు చేశారు. ఇక హైకోర్టులో మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా అదే రోజున విచారణ జరగనుంది. దీంతో ఒకవైపు హైకోర్టు, మరోవైపు సుప్రీంకోర్టు విచారణలు ఉండటంతో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా అయినా “బ్రేక్” పడినట్లే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంలో చట్టపరమైన స్పష్టత లేకుండా ముందుకు వెళ్తే ఎన్నికలు నిలిచిపోయే ప్రమాదం ఎక్కువే. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల తరువాతే పూర్తి స్పష్టత వస్తుంది. అంటే, ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరగడం చాలా కష్టసాధ్యం అని పేర్కొంటున్నారు. రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో, ఎన్నికల షెడ్యూల్ ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు సమయానికి జరగే అవకాశాలు మందగించినట్టే కనిపిస్తున్నాయి.

– క్రైమ్ మిర్రర్ విశ్లేషణాత్మక ప్రత్యేక కథనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button