
PM Modi On New GST: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి జీఎస్టీ కౌన్సిల్ సంచలన సంస్కరణలపై ప్రధాని మోడీ స్పందించారు. తాజా సంస్కరణలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. వ్యాపారం మరింత సరళతరమవుతుందని, చిరు వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. సామాన్య ప్రజలకు ఊరటనిస్తూనే ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
అన్ని వర్గాలకు మేలు
తాజా జీఎస్టీ సంస్కరణలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, మహిళలు, యువత, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వారికి ప్రయోజనం కలిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయన్నారు మోడీ. జీఎస్టీలో భారీ సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు ఎర్రకోట వేదికగా తాను స్వాతంత్య్ర దినోత్సవాన ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
జీఎస్టీలో వినూత్న సంస్కరణలు
జీఎస్టీలో వినూత్న సంస్కరణలు తీసుకువస్తామని ప్రధాని మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించినట్లుగానే కొత్త జీఎస్టీ స్లాబ్ లు రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ సంస్కరణలు కేవలం పన్ను రేట్ల హేతుబద్ధీకరణ మాత్రమే కాదన్న ఆమె.. పేదలు, మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉంటాయన్నారు.