కాలేజీ లెక్చరర్ లైంగిక వేధింపుల కారణంగా 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని మృతి చెందింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా చనిపోయింది. విద్యార్థిని మృతికి కారణమైన లెక్చరర్‌తో పాటు ముగ్గురు విద్యార్థినులపై తాజాగా ధర్మశాల పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 75, 115(2), 3(5)తో పాటు ర్యాగింగ్ నిషేధ చట్టంలోని సెక్షన్ 3 కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇంతకీ అసలు ఏం జరుగుతుందంటే?
హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని ప్రభుత్వ కాలేజీలో పల్లవి అనే 19 ఏళ్ల యువతి డిగ్రీ చదువుతుంది. గతేడాది సెప్టెంబర్ 18న ఆమెపై అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్ తో పాటు ముగ్గురు తోటి విద్యార్థులు ర్యాగింగ్, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తన కుమార్తెపై శారీరకంగా దాడి చేసి, బెదిరించారని బాధితురాలి తండ్రి చెప్పాడు. కాలేజీలో ఓ లెక్చరర్ తమ కుమార్తె పట్ల అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదులో మృతురాలి తండ్రి ఆరోపించారు. వారి వేధింపులు, బెదిరింపుల కారణంగా తన కుమార్తె భయపడి, మానసికంగా కుంగిపోయిందని, దానివల్ల ఆమె ఆరోగ్యం క్షీణించిందని పోలీసులకు చెప్పాడు.
మానసికంగా కుంగిపోయి చికిత్స పొందుతూ..
ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో, హిమాచల్‌లోని వివిధ ఆసుపత్రులలో ఆమెకు చికిత్స అందించినట్లు ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఆమెను లుధియానాలోని దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పల్లవి 2025 డిసెంబర్ 26న మరణించింది. తన కుమార్తె చాలా కాలం పాటు తీవ్ర అనారోగ్యంతో, మానసిక వేదనతో ఉన్నందున, తాను ఈ విషయాన్ని ఇంతకు ముందు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని మృతురాలి తండ్రి చెప్పాడు. ఆమె మరణంతో కుటుంబం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని, అందుకే ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగిందని ఆయన వెల్లడించాడు. ఫిర్యాదును పరిశీలించి, ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత ముగ్గురు విద్యార్థులు, సదరు లెక్చరర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.





