రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. పల్లె, పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు.. ఉదయం పూట పొగ మంచు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 29, 30 తేదీల్లో విపరీతమైన శీతల గాలులు వీస్తాయని అంచనా వేసింది.
డిసెంబర్ తొలి వారంలో వర్షాలు
అటు డిట్ వా అనే తుఫాను కారణంగా డిసెంబర్ తొలి వారంలోనే పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షాలు కురిసినా.. చలి తీవ్రత మాత్రం తగ్గే పరిస్థితి లేనట్లు తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలు చలికి వణుకుతున్నారు.
జాగ్రత్తగా ఉండాలంటున్నా అధికారులు
చలి ప్రభావం తీవ్రరూపం దాల్చనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, వ్యాధులతో బాధ పడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలంటున్నారు. అంతగా అవసరం అనుకుంటే మధ్యాహ్నం సమయంలోనే రాకపోకలు సాగించాలంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇళ్లలో వెచ్చదనం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలంటున్నారు. చలితోపాటు ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు చలిని తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. స్వెట్టర్లు,తలకు టోపీలు తప్పనిసరిగా పెట్టుకోవాలంటున్నారు.





