జాతీయం

సీఎం కారుకు ఏకంగా ఆరు చలాన్లు, ఎందుకంటే?

CM Siddaramaiah Official Car: సాధారణ పౌరుల వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించడం చూస్తుంటాం. కానీ, హై సెక్యూరిటీతో వెళ్లే ముఖ్యమంత్రుల కార్లకు కూడా జరిమానాలు పడుతున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  ప్రయాణించే కారుకు సైతం చలానాల గోల తప్పలేదు. 2024 నుంచి సిటీ జంక్షన్ల వద్ద పలుమార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు కెమెరాలలో రికార్డయింది. దీంతో సిద్ధరామయ్య ఆ బకాయిలు చెల్లించారు. 50 శాతం డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఆ రాయితీని ఉపయోగించుకుని సీఎం జరిమానాలు కట్టారు. ఆరు వేర్వేరు సందర్భాల్లో సిద్ధరామయ్య ప్రభుత్వ కారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు తెలుస్తోంది.

ITMS కెమెరాల్లో ఉల్లంఘనల రికార్డు

తాజాగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజిమెంట్ సిస్టమ్(ITMSI కెమెరాల్లో సీఎం ఫ్రంట్ సీటులో సీటుబెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్నట్టు రికార్డయింది. మరో కేసులో ఆయన వాహనం కెంపెగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్స్‌ ప్రెస్ కారిడార్ మీదుగా వేగంగా వెళ్తుండటం రికార్డయింది. గత జనవరి, ఫిబ్రవరి, ఆగస్టుల్లో కూడా సీట్‌ బెల్ట్ ఉల్లంఘన కేసులు రికార్డయ్యాయి. ఆరుసార్లు నిబంధనల ఉల్లంఘనలకు రూ.5,000 జరిమానా పడింది. సీఎం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో సిద్ధరామయ్య బకాయిలు చెల్లించినట్టు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. రిబేట్ స్కీమ్‌ కింద రూ.2,500 చెల్లించినట్టు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button