తెలంగాణ

హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ ఆకస్మిక పర్యటన

  • ముంపు ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి

  • అమీర్‌పేటలోని పలు కాలనీల్లో పర్యటించిన రేవంత్‌

  • గంగూబాయి బస్తీ, బుద్ధనగర్‌లో ప్రజలతో ముఖాముఖి

  • స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీఎం

  • సహాయ చర్యలు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశం

  • ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచన

  • భారీ వర్షాలతో రాజధానిలో ముంపునకు గురైన కాలనీలు

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో రాజధాని నగరం అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయవుతున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తుంటే… ఫ్లై ఓవర్లు జలపాతాల్లా మైమరపిస్తున్నాయి. లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అమీర్‌పేట బస్తీల ప్రజలతో ముఖాముఖి

భారీవర్షాలతో గత కొన్నిరోజులుగా జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం నేరుగా రంగంలోకి దిగారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో కలిసి అమీర్‌పేటలోని గంగూబాయి బస్తీ, బుద్ధనగర్‌లో ముఖ్యమంత్రి పర్యటించారు. భారీ వర్షాలతో రోడ్లపైకి చేరిన మురుగునీరు, డ్రైనేజీ వ్యవస్థను సీఎం రేవంత్‌ పరిశీలించారు. ప్రజలను అడిగి సమస్యలను, ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రజలు వారి అవస్థలను సీఎం రేవంత్‌కు వివరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు.

సీఎం కీలక ఆదేశాలు

అమీర్‌పేటలో క్షేత్రస్థాయి పర్యటన అనంతరం అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. నీరు నిలిచినప్రాంతంలో వెంటనే సహాయ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని సూచించారు. విద్యుత్‌ స్తంభాలు, మ్యాన్‌హోల్స్‌కు దూరంగా ఉండాలన్నారు.

ఇవీ చదవండి

  1. కమలం గూటిలో చేరిన గువ్వల
  2. ఖమ్మంలో దొంగల హల్‌చల్‌ – సీసీ కెమెరాల్లో రికార్డ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button