తెలంగాణ

పాక్ ను రెండు ముక్కలు చేద్దాం.. మోడీకి రేవంత్ పిలుపు

పహల్గామ్ భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామని చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు నిరసనగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి భారీ ర్యాలీ తీశారు సీఎం రేవంత్ రెడ్డి. ట్యాంక్ బండ్ పై జరిగిన ర్యాలీలో మాట్లాడిన సీఎం.. పాకిస్తాన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని అన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం..ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి తెలుపుతోందని సీఎం రేవంత్ అన్నారు. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇద్దామని పిలుపిచ్చారు.

1967, 1971 లో ఇలాంటి దాడులు జరిగినపుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను ఇందిరాగాంధీ.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేశారని తెలిపారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారని రేవంత్ గుర్తు చేశారు. ప్రధాని మోడీ దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని.. ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలని సీఎం రేవంత్ సూచించారు. కోట్లాదిభారతీయులంతా మీకు మద్దతుగా ఉంటారు… ఒక్క దెబ్బతో పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయండని రేవంత్ సూచించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button