CM Revanth Reddy: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు శుభవార్త ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళల అభివృద్ధి, విద్యార్థినుల సాధికారత కోసం ఇచ్చిన హామీల అమలుపై కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన కాలేజీ చదువుతున్న విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అందజేస్తామని ప్రకటించిన ఎన్నికల హామీపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని తెలిపారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది సాధ్యంకాకపోయినా త్వరలోనే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అందించే దిశగా కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుని మహిళలు విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు రావాలని, ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నగరంలోని ప్రజా భవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన ముఖ్యమంత్రి మహిళల సాధికారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
మహిళలకు సముచిత గౌరవం, గుర్తింపు కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా అధికారుల పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. అనేక ముఖ్యమైన శాఖలను మహిళా అధికారులు సమర్థంగా నడిపిస్తున్నారని తెలిపారు. ఇటీవల మావోయిస్టుల లొంగుబాట్ల ప్రక్రియలో కూడా మహిళా అధికారులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. మహిళలకు అవకాశం కల్పిస్తే వారు ఏ రంగంలోనైనా ప్రతిభ కనబరుస్తారని, సమాజ అభివృద్ధికి పెద్ద ఎత్తున తోడ్పడతారని పేర్కొన్నారు.
దేశంలో ఇంకా వివక్ష పూర్తిగా తొలగిపోలేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కులాల మధ్య మాత్రమే కాకుండా స్త్రీ, పురుషుల మధ్య కూడా వివిధ రకాల వివక్ష కనిపిస్తోందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు లభిస్తుందని, ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు లభిస్తాయని అన్నారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధించగలదని అభిప్రాయపడ్డారు. మన దేశంలో మహిళలు కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తున్నప్పటికీ వారి కృషికి తగిన గుర్తింపు అందడం లేదని చెప్పారు. ఇంటి పనులు, కార్యాలయ పనుల విషయంలో మహిళలను చిన్నచూపు చూసే పరిస్థితులు ఇంకా ఉన్నాయని అన్నారు. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయాలంటే మహిళల ప్రతిభను గుర్తించి వారికి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సంస్థలపై ఉందని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా కొన్నిసార్లు మార్పులు సాధ్యం కాకపోయినా వ్యవస్థాత్మకంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని తెలిపారు.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని ముఖ్యమంత్రి వివరించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తయారవుతున్న ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించే అవకాశాలు కల్పించామని తెలిపారు. స్థానిక ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వేదికలను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారి ప్రయాణ భారాన్ని తగ్గించామని చెప్పారు. కొందరు ఈ ఉచిత ప్రయాణాన్ని చిన్నచూపు చూస్తున్నప్పటికీ అదే మహిళలను ఆర్థికంగా బలపరిచే చర్యగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. మహిళలు స్వయంగా వ్యాపార రంగాల్లో ముందుకు రావడానికి ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో కూడా స్వయం సహాయక సంఘాలకు అవకాశాలు కల్పించామని తెలిపారు.
నగర అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ నగరాలతో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పెద్ద పరిశ్రమలను నగర పరిధి వెలుపలికి తరలించే ప్రణాళికపై ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 2026 డిసెంబర్ నాటికి నగరంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే నడిచే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయని, త్వరలో మరో 2300 బస్సులు సేవల్లోకి రానున్నాయని చెప్పారు. వచ్చే డిసెంబర్ 9 నాటికి నగరంలో ఒక్క డీజిల్ బస్సు కూడా లేకుండా అన్ని ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడిచే విధంగా ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. ఈ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ తో నడిచే ఆటోలను కూడా క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
మధుపార్క్ అపార్టుమెంట్ కు సంబంధించిన వివాదంపై కూడా ముఖ్యమంత్రి స్పందించారు. ఈ అపార్టుమెంట్ ఈసా నది ఒడ్డున నిర్మించబడిందని వివరించారు. అక్కడ ఉన్న ప్రవాహ మార్గాన్ని నాలాగా చూపించి నిర్మాణం చేపట్టారని తెలిపారు. 2012 చట్టం ప్రకారం మూసీ, ఈసా నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే నిర్మాణాలు జరిగితే వాటిని తొలగించాలని జాతీయ పర్యావరణ న్యాయస్థానం, సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పేర్కొన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న వారికి నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
మధుపార్క్ ప్రాంతంలో ఉన్న సుమారు 7 ఎకరాల అపార్టుమెంట్ కు బదులుగా పక్కనే ఉన్న మరో 7 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఎంత పరిమాణంలో నిర్మాణం జరిగిందో అదే స్థాయిలో కొత్త నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన నిధులను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నివాసితులు నష్టపరిహారం తీసుకుని వేరే చోట ఇళ్లు కొనుగోలు చేసుకోవాలనుకుంటే కూడా వారికి స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఈ అంశంపై నివాసితులు ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వంతో చర్చించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అయితే ఈ విషయానికి రాజకీయ రంగు పులుముకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు అక్కడికి వెళ్లి సానుభూతి చూపడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరకదని అన్నారు. బఫర్ జోన్ పరిధిలో 50 మీటర్లలో నిర్మాణాలు ఉంటే వాటికి భవిష్యత్తులో విలువ ఉండదని స్పష్టం చేశారు.
ALSO READ: Pradakshina Meaning: గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసా?
