ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

CM Good News: సంక్రాంతి నుంచి అన్నీ..

CM Good News: రాష్ట్రంలో పాలనను పూర్తిగా డిజిటల్‌ దిశగా మలచే ప్రక్రియను వేగవంతం చేస్తూ సంక్రాంతి నుంచే ప్రజలకు అందించే అన్ని ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

CM Good News: రాష్ట్రంలో పాలనను పూర్తిగా డిజిటల్‌ దిశగా మలచే ప్రక్రియను వేగవంతం చేస్తూ సంక్రాంతి నుంచే ప్రజలకు అందించే అన్ని ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయా శాఖలన్నింటికీ స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేశారు. సోమవారం ఆర్టీజీఎస్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. భౌతిక పర్యటనలు, కార్యాలయాల చుట్టూ తిరగటం, ఫైలులు వెళ్లే వేగం వంటి సంప్రదాయ పద్ధతులకు పూర్తిగా తెరదించి, పారదర్శకతతో కూడిన డిజిటల్‌ సేవలవైపు మలిచే సమయం వచ్చిందని అన్నారు.

ప్రస్తుతం కొన్ని శాఖలు ఇంకా పాతరీతిలో సేవలు అందిస్తున్నప్పటికీ, అలాంటి శాఖలు వెంటనే తమ విధానాన్ని మార్చుకుని ప్రజలు ఇంటి వద్ద నుంచే అవసరమైన నకళ్లు, ధృవపత్రాలు, సర్వీసులు పొందే విధంగా ఆన్‌లైన్‌ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడం కోసం మ‌న‌మిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ను మరింత విస్తృతంగా ఉపయోగించాలని సీఎం సూచించారు. కార్యాలయాలకు వెళ్లకుండా అవసరమైన సమాచారాన్ని, దరఖాస్తులను, సేవలనుచేరవేసేలా సాంకేతికతను ప్రజల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్ శాఖ సేవలు పూర్తిగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కు అనుగుణంగా నడవాలని, రిజిస్ట్రేషన్ తర్వాత డాక్యుమెంట్‌లను సంబంధిత వ్యక్తుల ఇంటికే కొరియర్‌ ద్వారా పంపే విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ తరువాత ప్రజలు కార్యాలయాలు తిరగాల్సిన పనిలేకుండా చేయడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ఆర్టీసీ సేవల నిలకడ, ప్రయాణికులకు అందించే సౌకర్యాలు, బస్టాండ్ల పరిశుభ్రత, టాయిలెట్‌ల సంరక్షణ వంటి అంశాలను ఇంకా మెరుగుపరచాలన్న దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రతకు సంబంధించిన చిన్న విషయాలే ప్రజల మనసులో పెద్ద మార్పు తీసుకువస్తాయని, ఆ దిశగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు.

డ్రోన్‌ సేవల విస్తరణపై కూడా ముఖ్యమంత్రి ముఖ్యమైన సూచనలు చేశారు. భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం ప్రతి రంగంలోనూ పెరిగిపోతుందని, అత్యాధునిక సాంకేతికతను సమర్థవంతంగా వాడేలా ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయరంగంలో పురుగుమందుల వినియోగాన్ని తగ్గించేందుకు డ్రోన్లను ఎలా వినియోగించవచ్చో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ పరిసరాల్లో పారిశుద్ధ్యం పెరగడం ద్వారా వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందని, పర్యావరణాన్ని కాపాడే దిశగా డ్రోన్లు ఎంతో ఉపయోగకరమవుతాయని చెప్పారు.

అధికారులలో కొందరు జిల్లాల్లో అమలు చేస్తున్న మంచి పద్ధతులు గుర్తింపు పొందుతున్నాయని, అలాంటి విధానాలను రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా విస్తరించాలని సూచించారు. పాలనా విధానాల్లో నాణ్యత, వేగం, బాధ్యత పెంపు కోసం అన్ని శాఖలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సమీక్షలో ముఖ్య కార్యదర్శి విజయానంద్‌తో పాటు అనేక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ALSO READ: Donald Trump: భారత్‌కు మరో షాక్!.. బియ్యంపై అదనపు పన్నులు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button