China Population Crisis: అధిక జనాభా అండతో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించిన చైనాకు.. ఇప్పుడు ఆ దేశంలో పడిపోతున్న జనాభా భయాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం చైనా తీవ్రమైన జనాభా సంక్షోభంలో కొనసాగుతోంది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజాగా విడుదల చేసిన నివేదిక డ్రాగన్ దేశాన్ని కలవరపెడుతున్నాయి. వరుసగా నాలుగో ఏడాది జనాభా తగ్గుదల సమస్యతో ఆ దేశం తంటాలు పడుతోంది. దీర్ఘకాలంలో శ్రామికశక్తి తగ్గిపోయి ఆర్థికంగా సంకట స్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతోంది. ప్రభుత్వం ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా అక్కడి యువత పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అంటుండడంతో సంతృప్తికర ఫలితాలను ఇవ్వవ్వడం లేదు. దీంతో దేశంలో వృద్ధ జనాభా పెరిగి, జననాల రేటు తగ్గి సంక్షోభం నెలకొన్న వేళ దేశ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆరున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా
తాజా గణాంకాల ప్రకారం, గతేడాదితో పోలిస్తే చైనా జనాభా 140.83కోట్ల నుంచి 140. 49కోట్లకు పడిపోయింది. అంటే 33.9లక్షల జనాభా కనుమరుగైంది. 2025లో సుమారు 79.2లక్షల మంది పిల్లలు జన్మించారు. ఈ సంఖ్య 2024 జననాల రేటు(95.4లక్షలు)తో పోలిస్తే 17శాతం తగ్గిందని నివేదిక తెలిపింది. 1949 నుంచి ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప జనన రేటు ఇదే. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100నాటికి చైనా జనాభా 63.3 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
పెరుగుతున్న వృద్ధుల సంఖ్య
మరోవైపు చైనా వేగంగా వృద్ధాప్యం వైపు అడుగులేస్తోంది. 2024 చివరి నాటికి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 31కోట్లకు చేరగా, 2035 నాటికి 40కోట్లు దాటుతుందని అంచనా. ఓవైపు జననాల రేటు తగ్గుతుంటే, మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గతేడాది చైనాలో సుమారు 1.13కోట్ల మంది మరణించారు. గత 50ఏళ్లలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. 65ఏళ్ల క్రితం సంభవించిన ఘోర కరువు తర్వాత, చైనాలో జనాభా ఇంతవేగంగా తగ్గడం ఇప్పుడే జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు.





