Big Blow to Congress: ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక కార్యాలయాలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఉన్న 24, అక్బర్ రోడ్ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. వచ్చే శనివారం లోగా ఆ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆదేశించింది. ఇదే కాకుండా, 5, రైసినా రోడ్‌లో ఉన్న యూత్ కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా ఈ నెల 28లోగా ఖాళీ చేయాలని మరో నోటీసు ఇచ్చింది. కేంద్రం నోటీసులతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
కోట్లా మార్గ్ లో ‘ఇందిరా భవన్’ పేరుతో కొత్త కార్యాలయం
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని కోట్లా మార్గ్ లో ఇందిరా భవన్ పేరుతో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. అయినప్పటికీ, పాత కార్యాలయాల నుంచే ఇంకా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 24, అక్బర్ రోడ్ బంగ్లా దాదాపు 48 ఏళ్లుగా పార్టీకి ప్రధాన కేంద్రంగా ఉంది. కాంగ్రెస్ చరిత్రలో ఈ భవనానికి ప్రత్యేక స్థానం ఉంది.
కోర్టులో తేల్చుకుంటామంటున్న కాంగ్రెస్
అటు కార్యాలయాలను ఖాళీ చేయాలని ఇచ్చిన నోటీసులను కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమ కార్యాలయాలకు మార్కెట్ రేటు ప్రకారం అద్దె చెల్లిస్తున్నామని వారు చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. అలాగే, ఈ రెండు బంగ్లాలను వదిలే ఉద్దేశం తమకు లేదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. 24, అక్బర్ రోడ్ అంటేనే కాంగ్రెస్ గుర్తుకు వచ్చేంతగా ఈ భవనానికి పార్టీతో భావోద్వేగ అనుబంధం ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన ఈ నోటీసులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
