దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు 2 వేల విమానాలు రద్దు కావడంతో ఎయిర్ పోర్టులలో ప్రయాణీకులు పడిగాపులు కాశారు. ఇండిగో విమాన సర్వీసులు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో రద్దు కావడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ సంక్షోభంపై పూర్తి స్థాయిలో నిజాలను తేల్చేందుకు కేంద్రం చర్యలకు దిగింది. ఇందుకోసం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సంక్షోభానికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
మూడు రోజుల్లో విమాన సర్వీసులు యధాతథం
గత నాలుగు రోజులుగా పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దు కావడంతో తలెత్తిన సంక్షోభం మీద ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర విమానాయానశాఖ ప్రకటించింది. ఇండిగో సర్వీసుల్లో ఎక్కడ పొరపాటు జరిగింది? దీనికి బాధ్యులెవరనేది దర్యాప్తులో గుర్తించి, అవరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. భవిష్యత్తుల్లో ఇలాంటి అంతరాయాలు తలెత్తకుండా, ప్రయాణికులకు కష్టం కలకుండా చూస్తామని వివరించింది. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పేషెంట్లు, ఇతరులు ముఖ్యమైన పనుల కోసం ప్రయాణాలు చేస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలిపింది. ఫ్లైట్ సర్వీసులు ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నామని, మూడు రోజుల్లోగా పూర్తిగా పునరుద్ధిస్తామని తెలిపింది.
DGCA orders the constitution of a committee for a comprehensive review and assessment of the circumstances leading to operational disruptions of IndiGo airlines. pic.twitter.com/hGqKHralJY
— ANI (@ANI) December 5, 2025
నలుగురు సభ్యులతో దర్యాప్తు కమిటీ ఏర్పాటు
ఇండిగో సంక్షోభం మీద విచారణ జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన దర్యాప్తు కమిటీని కేంద్రం పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్స్ కు కలిగిన తీవ్ర అంతరాయం, ఇందుకు దారితీసిన పరిస్థితులపై కమిటీ దర్యాప్తు చేసి నివేదికను 15 రోజుల్లోగా సమర్పించనుంది. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.





