
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీఎం విద్యాలక్ష్మి పథకం 2026ను అమలు చేస్తోంది. ఉన్నత విద్య కోసం దేశంలోనూ, విదేశాల్లోనూ చదవాలనుకునే విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన విద్యార్థులు గరిష్టంగా రూ.10 లక్షల వరకు విద్యా రుణాన్ని సులభంగా పొందే అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఒకే దరఖాస్తుతో మూడు బ్యాంకులకు అప్లై చేసే వెసులుబాటు ఉండటం ఈ పథకానికి ప్రధాన ఆకర్షణగా మారింది.
చాలా మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక స్థోమత సరిపోక మధ్యలోనే చదువును ఆపేయాల్సిన పరిస్థితులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత సమగ్రంగా రూపొందించింది. గతంలో విద్యా రుణం కోసం విద్యార్థులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో రుణానికి దరఖాస్తు చేసుకునే విధంగా పీఎం విద్యాలక్ష్మి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ పథకం పూర్తిగా ఐటీ, డేటా సైన్స్ ఆధారంగా పనిచేసే ఏకీకృత విద్యా లోన్ పోర్టల్. ఇందులో దేశవ్యాప్తంగా నమోదు అయిన 40కి పైగా బ్యాంకులు విద్యా రుణాలను అందిస్తున్నాయి. విద్యార్థులు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ బ్యాంకులు అందించే లోన్ ఆప్షన్లను పోల్చిచూసుకుని, నచ్చిన మూడు బ్యాంకులను ఎంపిక చేసుకుని ఒకే ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల సమయం, శ్రమ రెండూ ఆదా అవుతున్నాయి.
పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా రూ.4 లక్షల వరకు రుణం పొందేవారికి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. అంతేకాదు, లోన్ దరఖాస్తు ఏ దశలో ఉందో విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే తెలుసుకునే సౌకర్యం ఉంది. ఈ పోర్టల్‌లో అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వడ్డీ సబ్సిడీ సౌకర్యం కూడా ఈ పథకంలో భాగంగా అందిస్తున్నారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. గుర్తింపు పొందిన కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులే ఈ లోన్‌కు అర్హులు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, కాలేజీ అడ్మిషన్ లెటర్, ఫీజు వివరాలు, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం వంటి పత్రాలు అవసరం అవుతాయి. వడ్డీ సబ్సిడీ పొందాలంటే ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి.
దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా సులభంగా రూపొందించారు. ముందుగా విద్యాలక్ష్మి అధికారిక పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫారమ్‌ను నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఎంపిక చేసిన బ్యాంకులకు దరఖాస్తును సబ్మిట్ చేయాలి. బ్యాంక్ అధికారులు దరఖాస్తును పరిశీలించి నిబంధనల ప్రకారం రుణాన్ని మంజూరు చేస్తారు. అవసరాన్ని బట్టి రూ.10 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది.
లోన్ రీపేమెంట్ విషయంలో కూడా విద్యార్థులకు వెసులుబాటు కల్పించారు. సాధారణంగా కోర్సు పూర్తయిన ఒక సంవత్సరం తర్వాత లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత రుణం చెల్లింపును ప్రారంభించవచ్చు. బ్యాంక్ నిబంధనలకు లోబడి విదేశీ విద్యకు కూడా ఈ పోర్టల్ ద్వారా లోన్ పొందే అవకాశం ఉండటం విశేషం. మొత్తంగా పీఎం విద్యాలక్ష్మి పథకం 2026 ప్రతిభావంతులైన విద్యార్థులకు నిజమైన వరంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో వెనుకబడుతున్న విద్యార్థులకు ఉన్నత విద్య దిశగా కొత్త దారులు తెరుస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ALSO RAED: Good news: వారికి ఆధార్ అప్‌డేట్ ఫ్రీ!





