Venezuelan Oil: వెనెజువెలాపై అమెరికా దాడి చేసి, ఆదేశ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో.. ఈ మొత్తం వ్యవహారంలో భారత్ కు మేలు కలిగే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ముఖ్యంగా చమురు ఎగుమతులపై ఆంక్షలు తొలగిపోతే ఓఎన్‌జీసీ ఉన్న అప్పు వసూలు కావడంతో పాటు అక్కడి ఆయిల్ ఫీల్డ్స్ లో చమురు వెలికితీత పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్నాక పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే దేశ నూతన అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రీగెజ్ బాధ్యతలు చేపట్టారు. ఇకపై ఆ దేశ వ్యవహారాలన్నీ అమెరికా కనుసన్నల్లోనే సాగబోతున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పరిణామాలు భారత్‌కు లాభించనున్నాయని అంటున్నారు.
వెనెజువెలాలో ఓఎన్‌జీసీ!
ఒకప్పుడు వెనెజువెలా నుంచి భారత్ భారీ స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుని ఇక్కడి రిఫైనరీల్లో శుద్ధి చేసేది. 2020లో వెనెజువెలాపై ఆంక్షల విధింపునకు ముందు సగటున 4 లక్షల బ్యారెళ్ల ముడి చమురు భారత్‌కు దిగుమతయ్యేది. ఆంక్షల దెబ్బతో ఈ దిగుమతులు చాలా వరకూ తగ్గిపోయాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్‌కు తూర్పు వెనెజువెలాలోని శాన్‌క్రిస్టోబాల్ చమురు క్షేత్రంలో 40 శాతం వాటా ఉంది. వెనెజువెలా ప్రభుత్వ రంగ సంస్థ పీడీవీఎస్ఏ చేతుల్లో మిగతా 60 శాతం వాటా ఉంది. కానీ అమెరికా ఆంక్షల తరువాత అక్కడి కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. 2014 నాటికే వెనెజువెలా ప్రభుత్వం ఓఎన్‌జీసీకి దాదాపు 1 బిలియన్ డాలర్ల మేర డివిడెండ్ చెల్లించాలి. ప్రస్తుతం ఈ అప్పు దాదాపు రెట్టింపైనట్టు తెలుస్తోంది.
భారత్ కు బాకీలు వసూలయ్యే అవకాశం!
వెనెజువెలా వ్యవహారాలు అమెరికా చేతుల్లోకి వెళ్లాక భారత్‌కు బాకీలు వసూలయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో ఓఎన్‌జీసీ మళ్లీ శాన్ క్రిస్టోబాల్ ఆయిల్ ఫీల్డ్స్ లో తన కార్యకలాపాలు ముమ్మరం చేసే అవకాశం ఉంది. శాన్ క్రిస్టోబాల్ ఆయిల్ ఫీల్డ్స్ లో ప్రస్తుతం ముడి చమురు వెలికితీత రోజుకు సుమారు 10 వేల బ్యారెళ్లుగా ఉంది. అమెరికా ఆంక్షలు తొలగిపోతే రాబోయే రోజుల్లో చమురు వెలికితీత లక్ష బ్యారెళ్లకు చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బాకీలు వసూలు కావడంతో పాటు భారత్ కు లాభం చేకూరనుంది శాన్ క్రిస్టోబాల్ ఆయిల్ ఫీల్డ్ తో పాటు కారబోబో ఆయిల్ ఫీల్డ్‌లోనూ ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్‌కు 11 శాతం వాటా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెరో 3.5 శాతం వాటాలున్నాయి.





