
-
కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తాం
-
అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటాం
-
అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం: రేవంత్
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికను తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. సభ్యులందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెల్లడించొచ్చన్నారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్లు, ఎవరిపైనో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలకు తావివ్వబోమన్నారు. కాంగ్రెస్ సర్కార్ పారదర్శకంగా పనిచేస్తుందన్నారు రేవంత్.
కేసీఆర్ సొంత నిర్ణయాలతో చేటు
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల దుస్థితికి కేసీఆర్ కారణమని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెబుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేసీఆర్ సొంత నిర్ణయాలే తప్ప.. నిపుణుల కమిటీ నివేదిక అమలు చేయలేదన్నారు. సరైన అధ్యయనాలు, పరిశోధనలు లేకుండానే డిజైన్లు రూపొందించారన్నారు. పూర్తి అక్రమాలకు అప్పటి సీఎం కేసీఆర్ కారణమని దుయ్యబట్టారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే ప్రాజెక్టు కడుతున్నామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని, కానీ నిపుణుల కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు.