
బీఆర్‌ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ రజతోత్సవ వేడుకల వేళ.. కేసీఆర్ కు సొంత జిల్లాలోనే ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీ మారేందుకు రెడీ అయినట్టు ప్రచారం సాగుతోంది. బీఆర్‌ఎస్ పార్టీలో ఉద్యమం సమయం నుంచి కొనసాగిన కొత్త ప్రభాకర్ రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2014లో కేసీఆర్ మెదక్ ఎంపీ సీటుకు రాజీనామా చేయడంతో.. అక్కడి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి చూపు కాంగ్రెస్ వైపు మళ్లినట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దుబ్బాకకు స్కిల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేయమని కోరారు. అప్పట్లోనే ఆయన పార్టీ మారుతారని టాక్ వినిపించింది. దీనికి బలం చేకూరుస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించడం హాట్‌టాపిక్‌గా మారింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దుబ్బాక నియోజకవర్గానికి నిధులు రాలేదన్నారు.. కానీ కాంగ్రెస్ హయాంలో ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు దుబ్బాక నియోజకవర్గానికి స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తే నష్టపోయేది మనమే అన్నారు. అయితే ఉన్నపళంగా కొత్త ప్రభాకర్ రెడ్డి యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ప్రభాకర్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడి ఉంటారనే కోణంలో బీఆర్‌ఎస్ హైకమాండ్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలోనూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి రేవంత్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అప్పట్లో పార్టీ మారేందుకే సీఎంను కలిశారని ప్రచారం సాగినా.. కేవలం అభివృద్ధిలో భాగంగానే రేవంత్ రెడ్డిని కలిసినట్టు ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిరోజులు సైలెంట్‌గా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి. తాజాగా మరోసారి సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. దుబ్బాకకు స్కిల్ యూనివర్సిటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయన కోరిన వెంటనే దుబ్బాకకు స్కిల్ యూనివర్సిటీని మంజూరు చేశారు. ఇటీవలే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురి పెళ్లికి కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.సీఎం రేవంత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్య బంధుత్వం కూడా ఉంది. దీంతో దాదాపుగా ఆయన కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.