* తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో చతికిల పడిన బీఆర్ఎస్
* పనిచేయని వ్యూహం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ: తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ చేతులెత్తేసింది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తగిలిన దెబ్బ మరిచిపోక ముందే.. రాజ్యసభ రూపంలో మరో షాక్ తగిలింది గులాబీ పార్టీకి. ఆ పార్టీకి శాసనసభలో తగినంత బలం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటాం అంటూ కేటీఆర్ తో పాటు హరీష్ రావు పెద్దమాటలే చెప్పారు. ముఖ్యంగా అభిషేక్ సింగ్వీ విషయంలో గట్టిగానే మాట్లాడారు. కానీ అభిషేక్ తో పాటు వేం నరేందర్ రెడ్డి అట్టహాసంగా రాజ్యసభకు నామినేషన్లు వేశారు. అయితే బిఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడ కనిపించలేదు. తద్వారా గులాబీ పార్టీ నేతల మాటలు నీటి మూటలేనని తేలిపోయింది.
పనిచేయని ఫామ్ హౌస్ వ్యూహాలు..
కెసిఆర్ కు ప్రత్యేక వ్యూహాలు ఉంటాయి అంటారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉండి ఆయన రచించే వ్యూహాలు అంతు పట్టనివి అంటారు. అయితే అవన్నీ గతంలో. ఇప్పుడు కెసిఆర్ వ్యూహాలు పారకుండా పోతున్నాయి. అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇస్తున్న స్టేట్మెంట్లు క్యాడర్లు జోష్ నింప లేకపోతున్నాయి. క్షేత్రస్థాయిలో కేటీఆర్ తో పాటు హరీష్ రావు గట్టిగానే కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా వర్కౌట్ కావడం లేదు. మేము పోటీ చేసి గెలుస్తాం అంటూ గులాబీ పార్టీ అగ్ర నేతలు ఆశలు చూపిస్తుండడంతో చాలామంది ముందుకు వస్తున్నారు. ఏరా సమయానికి వచ్చాక తప్పుకుంటున్నాం.. ఇది వ్యూహాత్మకంలో భాగమేనని చెబుతున్నారు. దీంతో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్న వారు డిఫెన్స్ లో పడుతున్నారు.
పవర్ లో ఉంటే పర్వాలే..
జరుగుబాటు ఉన్నప్పుడు జంగిడిలో కూడా నీరు నిల్వ ఉంచుకోవచ్చు. కానీ పరిస్థితులు తారుమారు అయ్యాక తమదేపై చేయి అంటే మాత్రం తగదు కూడా. ప్రస్తుతం గులాబీ పార్టీ పరిస్థితి అలానే ఉంది. చూస్తే ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. హాయ్ కమాండ్ చెప్పే మాటలు వింటే అతివిశ్వాసం కనిపిస్తోంది. ఫలితాల్లో మాత్రం అట్టడుగున ఉండాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తాం అంటూ చేస్తున్న ప్రకటనలు.. తీరా గులాబీ పార్టీని పరువు తీసేలా ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికల్లోను గులాబీ పార్టీ ఇదే మాదిరిగా దెబ్బతింటుంది. తొలుత ఆర్భాటపు ప్రకటనలు.. అటు తరువాత వ్యూహం అంటూ పక్కకు తప్పుకోవడం ఆ పార్టీకి అలవాటైన విద్యగా మారింది.
బలం లేకపోవడంతో..
తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ వ్యూహం అని చెప్పి తప్పించుకుంది కానీ.. మా దగ్గర ఆశించిన బలం లేదు అని స్వయంగా ఒప్పుకున్నట్లు అయింది. మరి ఉన్నది స్వల్ప కాలమే. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇలానే సిద్ధం అయితే మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికరమే. వ్యూహాలు గతంలో పనిచేశాయి కానీ ఇప్పుడు పని చేయవు అన్నది గులాబీ పార్టీపై ఒక సెటైర్. ఇలానే ముందుకు వెళితే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి బిజెపికి బి టీం అవ్వక తప్పని పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలో హస్తం పార్టీ హై స్పీడ్ గా వెళ్తోంది. కానీ కార్ రివర్స్ గేర్ లో ముందుకు సాగుతోంది. ఇలానే సాగితే వచ్చే ఎన్నికల్లో కూడా చతికల పడడం ఖాయం. ఇకనుంచైనా గులాబీ పార్టీ ముందస్తు ప్రకటనలు మానుకొని.. ఎన్నికలకు సిద్ధమైతే మంచిది.
