
-
ఒంటరి మహిళలే టార్గెట్‌గా దోపిడీలు
-
రూ.19లక్షల విలువైన బంగారం స్వాధీనం
-
కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన ఎస్పీ శరత్ చంద్ర
క్రైమ్ మిర్రర్, నల్గొండ: ఒంటరిగా వెళ్తున్న మహిళలే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర మాట్లాడుతూ మహిళల మెడలో బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి రూ.19లక్షలు విలువచేసే 8 బంగారు పుస్తెల తాళ్లు, రెండు సెల్‌ఫోన్లు, చోరీలకు ఉపయోగించిన నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Also Read : చివరి శ్వాస వరకు హిందుత్వమే.. రాజాసింగ్ ఎమోషనల్ ట్వీట్!
నల్గొండ జిల్లా త్రిపురాం మండలం నీలాయిగూడానికి చెందిన రావిరాల పవన్, రావిరాల రాజు ఇద్దరు సొంత అన్నదమ్ములు. చెడు వ్యవసనాలకు అలవాటు పడి, ఆర్థికంగా దిగజారిన వీరిద్దరూ దొంగతనాలకు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈనెల 4న చండూరు మండలం గొల్లగూడెంలో నడుచుకుంటూవెళ్తున్న బుచ్చమ్మ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బుచ్చమ్మ ఫిర్యాదు మేరకు చండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు టీములుగా ఏర్పడి కేసును త్వరితగతిన ఛేదించారు.
అయితే పోలీసుల విచారణలో మరిన్ని చోరీల విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 8కేసుల్లో వీరిద్దరూ నిందితులుగా పేర్కొన్నారు. కేసును త్వరగా ఛేదించిన నల్గొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డిని, చండూరు సీఐ ఆదిరెడ్డిని, చండూరు ఎస్‌ఐ వెంకన్నను, కనగల్ ఎస్‌ఐ విష్ణుమూర్తిని, వారి సిబ్బంది ఉపేంద్రచారి, శ్రీకాంత్, కార్తీక్, హరుణ్, నగేష్, అనిల్, ఖలీల్, రమేష్, నరేందర్‌ను ఎస్పీ శరత్‌చంద్రపవార్ అభినందించారు.