
BREAKING: ఇటీవల వరుసగా పరుగులు తీస్తూ సామాన్యుడిని ఆందోళనకు గురిచేసిన బంగారం ధరలకు కాస్త ఉపశమనం లభించినట్టుగా కనిపిస్తోంది. కొన్ని రోజులుగా లక్షల రూపాయల మార్క్‌ను దాటుతూ కొనుగోలుదారులను భయపెట్టిన బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. తులం బంగారం కొనాలంటే దాదాపు 1 లక్ష 35 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో, ఇప్పుడు ధరలో స్వల్ప తగ్గుదల వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది.
గుడ్‌రిటర్న్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం.. నిన్నటి రోజు నుంచి ఉదయం వరకు తులం బంగారం ధర రూ.1,35,380గా కొనసాగింది. అయితే, తాజాగా ఒక్కసారిగా రూ.1,520 వరకు తగ్గడంతో ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,33,860 స్థాయికి చేరుకుంది. ధరలు తగ్గినా ఇంకా చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలోనే కొనసాగుతున్నాయని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
భారతీయ సంప్రదాయంలో బంగారానికి మహిళలు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. వివాహాలు, శుభకార్యాలు, పెట్టుబడుల పరంగా బంగారానికి ఉన్న డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. అయితే ఇటీవల పరిస్థితి చూస్తే ఒక రోజు ధరలు తగ్గితే, మరుసటి రోజే అంతకంటే ఎక్కువగా పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. దీంతో కొనుగోలుదారులు ఎప్పుడు కొనాలన్న సందిగ్ధంలో పడుతున్నారు.
బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఉదయం 6 గంటల వరకు కిలో వెండి ధర రూ.2,03,000కు పైగా ట్రేడవుతుండగా, తరువాత ఒక్కసారిగా భారీగా పడిపోయింది. సుమారు రూ.3,900 మేర తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,99,100 వద్ద కొనసాగుతోంది. అయితే హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం వెండి ధర రూ.2,11,000 వద్ద కొనసాగడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,33,860గా ఉంది. అదే ఢిల్లీలో బంగారం ధర రూ.1,34,010గా ఉండగా, ముంబై మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.1,33,860 వద్ద కొనసాగుతోంది. నగరాల మధ్య స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ మొత్తం మీద ధరలు అధిక స్థాయిలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
అంతర్జాతీయ అంశాలు కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా డాలర్ బలహీనపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెరుగుతుండటం కూడా ధరలను నిలకడగా ఉంచుతోంది.
ఇవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ కారణాలన్నీ కలసి ధరలు పూర్తిగా తగ్గకుండా అడ్డుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్‌లో ధరలు మరింత పెరుగుతాయా లేదా స్థిరపడతాయా అన్నది అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని వారు చెబుతున్నారు.
ALSO READ: BIG BREAKING: రాష్ట్రంలో పింఛన్ డబ్బులు పెరుగుతున్నాయ్!





