ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

ప్రియురాలు దూరం పెట్టిందని.. ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు

తనను దూరం పెట్టిందన్న కోపంతో ఓ వ్యక్తి ఏకంగా తన ప్రియురాలి ముక్కును కోసిన దారుణ ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపింది.

తనను దూరం పెట్టిందన్న కోపంతో ఓ వ్యక్తి ఏకంగా తన ప్రియురాలి ముక్కును కోసిన దారుణ ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపింది. పిడుగురాళ్ల పట్టణ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మహిళపై అమానుషంగా దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

పిడుగురాళ్ల మదర్ థెరిస్సా కాలనీకి చెందిన మరియమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్తతో విభేదాల కారణంగా కొంతకాలంగా వేరుగా ఉంటున్న ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్న వెంకట్రావుతో కొంతకాలంగా సహజీవనం చేసినట్లు సమాచారం.

అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో వెంకట్రావును మరియమ్మ దూరం పెట్టింది. ఇంటికి రానీయకపోవడం, ఎదురుపడినా మాట్లాడకపోవడంతో వెంకట్రావులో కక్ష పెరిగింది. ఏదో ఒక విధంగా ఆమెకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ క్రమంలో నిందితుడు తన స్నేహితుడు రాజశేఖర్‌తో కలిసి మరియమ్మ ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు గమనించిన అనంతరం లోపలికి వెళ్లి వాగ్వివాదానికి దిగాడు. ఆ సమయంలో తన వెంట తెచ్చుకున్న కోడి కత్తితో ఆమెపై దాడి చేసి ముక్కును కోసేశాడు. అనంతరం కోసిన భాగాన్ని తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు.

తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన మరియమ్మను స్థానికులు వెంటనే పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో నర్సరావుపేట, అనంతరం గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

వెంకట్రావును దూరం పెట్టినందుకే తనపై కక్షకట్టి దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళపై హింసకు పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని స్థానికులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ALSO READ: ఫోన్‌పే వాడేవారికి గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు ఇన్‌స్టంట్ లోన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button