అంతర్జాతీయం

Australia Shooting: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి, ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి!

ఆస్ట్రేలియాలో జరిగిన కాల్పులను ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం పట్ల భారత్ కఠిన వైఖరి అవలంభిస్తుందన్నారు. ముష్కరుల కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

Bondi Beach shooting: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటపై యావత్ ప్రపంచం స్పందిస్తోంది. కాల్పుల్ని తీవ్రంగా ఖండిస్తూ, ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షులు బాధితులకు తమ సంఘీభావం తెలుపుతున్నారు. కాల్పుల ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోడీ, భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ సోషల్ మీడియాలో స్పందించారు.

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిందే!

“హనుక్కా పండుగ మొదటి రోజును జరుపుకుంటున్న యూదులను లక్ష్యంగా చేసుకుని, ఆస్ట్రేలియాలోని బాండి బీచ్‌లో ఈ రోజు జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశ ప్రజల తరపున, తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో మేము ఆస్ట్రేలియా ప్రజలకు సంఘీభావంగా నిలబడతాం. ఉగ్రవాదం పట్ల భారతదేశానికి ఏమాత్రం సహనం లేదు. ఉగ్రవాదపు అన్ని రూపాలు.. ప్రదర్శనలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తాము మద్దతిస్తాం”అని భారత ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. అటు, భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత, మృతుల కుటుంబాలకు  సానుభూతిని వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియా ప్రధాని దిగ్భ్రాంతి

బాండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బానీజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి దృశ్యాలు షాకింగ్‌గా, దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని చెప్పారు. పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్‌తో, న్యూ సౌత్ వేల్స్ (NSW) ప్రీమియర్‌తో మాట్లాడానని, NSW పోలీసులతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు.  ఆ ప్రాంతంలో ఉన్నవారు NSW పోలీసు సూచనలను పాటించాలని ఆస్ట్రేలియా ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ దాడిని ఉగ్రవాద దాడిగా ప్రకటించి, దర్యాప్తును వేగవంతం చేసింది.

Read Also: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు.. ఎందుకు ఈ నిర్ణయం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button