
Boeing Dreamliner: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం తర్వాత బోయింగ్ విమానాల పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అయ్యాయి. విమానాల తయారీ సంస్థ సైతం బోయింగ్ విమానాలను పరిశీలించింది. ముఖ్యంగా ఈ ప్రమాదానికి కారణమైన డ్రీమ్ లైనర్ విమానాలను తనిఖీ చేసింది. అయితే, తాజాగా ఈ విమానాల పనితీరుపై ఎయిర్ ఇండియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తమ సంస్థలో ఉన్న అత్యతం సేఫ్ విమానాల్లో ఇదొకటని వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1000కి పైగా డ్రీమ్ లైనర్ విమానాలు పని చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)కి సమర్పించిన నివేదికలో ఎయిర్ ఇండియా ఈ విషయాలను వెల్లడించింది.
విమానాల సేఫ్టీపై పీఏసీ సమావేశం
ఎయిర్‌పోర్టుల్లో లెవీ చార్జీలు అంశంపై చర్చించడానికి పీఏసీ సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్ లో జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో విమానాల్లో భద్రతా ప్రమాణాలపై ఆయా విమానయాన సంస్థలు సమాధానం చెప్పాలని ఎంపీలు డిమాండ్ చేశారు. గత కొద్ది కాలంగా విమానాల్లో తరచుగా భద్రతా లోపాలు తలెత్తడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ద్వారా వెంటనే దర్యాప్తు నిర్వహించాలని కోరారు.
అహ్మదాబాద్ ప్రమాదానికి కారణం ఏంటి?
ఈ సమావేశానికి పౌర విమానయాన శాఖ, డీజీసీఏ, ఏఏఐ, ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ, బీసీఏఎస్ ఉన్నతాధికారులు, ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, ఇతర విమానయాన సంస్థల సీనియర్ ప్రతినిధులు హాజరయ్యారు. అటు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) తన ప్రాథమిక నివేదికను తాజాగా పౌర విమానయాన శాఖకు సమర్పించింది. త్వరలోనే ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Also: ఉత్తరాదిలో వర్ష బీభత్సం, స్తంభించిన జనజీవనం!