
Lunar Eclipse: సంపూర్ణ చంద్ర గ్రహణం కనువిందు చేసింది. మన దేశంలో రాత్రి 9.56 గంటలకు మొదలైన గ్రహణం అర్ధరాత్రి 1.26 గంటలకు వీడింది. చంద్రుడు పూర్తిగా భూమి నీడకు వెళ్లిపోయాడు. 82 నిమిషాల పాటు ఎర్రబారి కనిపించాడు. ప్రజలు ఈ ఖగోళ వింతను చూసి ఆనందించారు. 2022 తర్వాత భారత్‌లో అత్యంత ఎక్కువ సేపు కనిపించిన సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడంతో చూసేందుకు జనాలు ఎగబడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలు మూసివేత
గ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలను ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ చేసిన తర్వాత తిరిగి తెరుస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేక పూజలు చేసి ఆదివారం నాడు మూసివేశారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ తలుపులను ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 12.25 గంటలకు రాజభోగం నిర్వహించి మూసివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయం తలుపులు 11.36 గంటలకే మూతపడ్డాయి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి అర్చకులు, ఆలయాధికారులు ద్వారబంధనం చేశారు. వరంగల్ భద్రకాళి దేవాలయం, వేయి స్తంభాల గుడి, నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం, జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీనరసింహస్వామి, మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాలను కూడా ప్రత్యేక పూజల అనంతరం మూసివేశారు. ఇవాళ సంప్రోక్షణ నిర్వహించిన తర్వాత మళ్లీ ఆలయాలు తెరుచుకోనున్నాయి.