Monday, February 23, 2026
HomeజాతీయంMaharashtra Politics: మహారాష్ట్రలో బీజేపీ-కాంగ్రెస్‌-ఎంఐఎం పొత్తు, నిప్పులు చెరిగిన సీఎం ఫడ్నవీస్!

Maharashtra Politics: మహారాష్ట్రలో బీజేపీ-కాంగ్రెస్‌-ఎంఐఎం పొత్తు, నిప్పులు చెరిగిన సీఎం ఫడ్నవీస్!

Maharashtra Political Shock: మహారాష్ట్రలో అధికార కూటమిలో అవకాశవాద రాజకీయ పొత్తలు సంచలనం కలిగించాయి. మున్సిపల్‌ కౌన్సిళ్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ నేతలు ఏకంగా కాంగ్రెస్‌, ఎంఐఎంతో జతకట్టాయి. థానే జిల్లా అంబర్‌నాథ్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ను దక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటయ్యాయి. 27మంది కౌన్సిలర్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన షిండే సేనకు అధికారం దక్కకుండా చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌, ఎన్సీపీ అంబర్‌నాథ్‌ వికాస్‌ అఘాడీ పేరిట కూటమిగా ఏర్పడ్డాయి. 60 స్థానాలున్న కౌన్సిల్‌లో మేయర్‌ పీఠం దక్కించుకోవడానికి 31మంది కౌన్సిలర్లు అవసరం కాగా బీజేపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు, 12 మంది కాంగ్రెస్‌, ఎన్సీపీకి చెందిన నలుగురు, ఇద్దరు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు కలిపి మొత్తం 32 మంది కూటమిలో చేరారు. దీంతో బీజేపీకి చెందిన తేజశ్రీ కరన్‌జులే అంబర్‌నాథ్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ మేయర్‌ అయ్యాడు.

బీజేపీ షిండే నేతల తీవ్ర ఆగ్రహం

అటు కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటూ పిలుపునిచ్చిన కమలనాథులు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం తమను వెన్నుపోటు పొడవమేనని, అధికారం కోసం ఎంతకైనా దిగజారడం సరికాదని షిండే సేన నేతలు ఆరోపించారు. తాము పొత్తు కోసం యత్నించినా షిండే సేన ముందుకు రాలేదని స్థానిక బీజేపీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీకి మద్దతిచ్చిన 12 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

ఎంఐఎం మద్దతుతో అకోట్‌ కౌన్సిల్‌ కైవసం

35 స్థానాలున్న అకోట్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌లో బీజేపీ తరపున 11 మంది కౌన్సిలర్లు నెగ్గారు. దీంతో ఉద్ధవ్‌ థాకరే యూబీటీ, షిండే సేన, అజిత్‌ పవార్‌ ఎన్సీపీ, శరద్‌ పవార్‌ ఎన్సీపీలకు చెందిన కౌన్సిలర్లతో పాటు ఏఐఎంఐఎంకు చెందిన నలుగురు కౌన్సిలర్లతో కలిపి బీజేపీ నేతలు అకోట్‌ వికాస్‌ మంచ్‌గా కూటమి ఏర్పాటు చేశారు. మొత్తం 25 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీజేపీకి చెందిన మాయా ధులే మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే, కాంగ్రెస్‌, ఎంఐఎంలతో స్థానిక నేతలు పొత్తులు పెట్టుకోవడాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తప్పుబట్టారు. సదరు నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొత్తులు వదులుకోవాలని తేల్చి చెప్పారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments