తెలంగాణ

యూరియా కోసం రోడ్డెక్కిన పిల్లి రామరాజు.. రైతులతో కలిసి ఆందోళన!

⦿ జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా అన్నదాతల అవస్థలు

⦿ ప్రజా సమస్యలు పట్టని కోమటిరెడ్డి, ఉత్తమ్

⦿ రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్న పట్టించుకోవడం లేదు

⦿ రైతులతో కలిసి నల్లగొండలో రాస్తారోకో చేసిన పిల్లి రామరాజు యాదవ్

⦿ అన్నదాతలకు యూరియా అందించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరిక

నల్లగొండ (క్రైమ్ మిర్రర్): సొంత నియోజయవర్గంలో రైతులకు యూరియా అందించడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విఫలం అయ్యారని బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు రోజుల తరబడి దుకాణాల దగ్గర అరిగోసపడుతున్నా కనీసం పట్టించుకున్న పాపానపోలేదన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రైతులతో కలిసి రామరాజు రాస్తారోకో..  

నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో ఉన్న శ్రీవేంకటేశ్వర ఎరువుల దుకాణం దగ్గర అన్నదాతలతో కలిసి పిల్లి రామరాజు రాస్తారోకో చేశారు. రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పుడు చెరిగారు. రైతుల సమస్యలను పట్టించుకోవడంలో హస్తం పార్టీ ఘోరంగా విఫలం అయ్యిందన్నారు. ప్రభుత్వం పట్టని తనం కారణంగానే ఈ రోజు అన్నదాతలు యూరియా కోసం రోడ్డెక్కె పరిస్థితి వచ్చిందన్నారు. వానాకాలం సాగు ఎంత అవుతుందో ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నా, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియాను తెప్పించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యింది. “గతంతో బీఆర్ఎస్  ప్రభుత్వం కేంద్రానికి కచ్చితమైన సాగు లెక్కలు చెప్పడంతో అందుకు అవసరమైన యూరియాను సకాలంలో అందించింది. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే పరిగణలోకి తీసుకుంటుంది తప్ప, తమ పార్టీ అధికారంలో ఉందా? లేదా? అనే ఆలోచన చేయదు. రేవంత్ సర్కారు రాష్ట్రానికి కావాల్సిన యూరియా లెక్కలను అందివ్వడంలో విఫలం అయ్యింది. ప్రభుత్వం చేసిన తప్పుకు పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా కేంద్రాల దగ్గర పడిగాపులు పడాల్సి వస్తుంది.  వానాకాలంలో ఇప్పటికే రెండోసారి యూరియా వేయాల్సి ఉన్నా, కొరతకారణంగా వేయలేకపోతున్నారు. పంటకు సరైన సమయంలో యూరియా వేయకపోతే పంటరాదని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు” అని పిల్లి రామారాజు యాదవ్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు వ్యతిరేక ప్రభుత్వం..

రేవంత్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా గుర్తింపు పొందిందని పిల్లి రామరాజు యాదవ్ విమర్శించారు. “రుణమాఫీలో విఫలం, రైతుబంధు ఇవ్వడంలో విఫలం, సన్నధాన్యానికి బోనస్ ఇవ్వడంలో విఫలం.. ఇప్పుడు అవసరమైన యూరియా అందించడంలో విఫలం అయ్యింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడినని జబ్బలు చరుచుకునే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత నియోజకవర్గ రైతులకు యూరియా అందించడంలో ఘోరంగా విఫలమయ్యారు.  అన్నదాతలు రోడ్డు మీద యూరియా కోసం అవస్థలు పడుతుంటే మంత్రి హైదరాబాద్ ఏసీ గదుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. రేవంత్ మంత్రివర్గంలోని ఖమ్మం జిల్లా మంత్రులు తమ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా సరఫరా చేయించుకుంటే, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి కూడా ఇక్కడి అన్నదాతల అవస్థలు పట్టించుకోవడం లేదు. రైతుల బాధలు పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకి, రైతు వ్యతిరేక హస్తం పార్టీకి స్థానిక సంస్థల్లో తగిన బుద్ధి చెప్పాలి” అని పిల్లి రామరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పిల్లి రామరాజుతో పాటు రైతులను రోడ్డు మీది నుంచి పక్కకు తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button