-
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఫండ్ పక్కదారి
-
హై కమాండ్ సమగ్ర దర్యాప్తు
-
సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బిజెపికి కొత్త తలనొప్పులు ప్రారంభం అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నిధుల గోల్ మాల్ వ్యవహారం ఆ పార్టీని కలవరపెడుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర పార్టీ నుంచి భారీగా నిధులు పంపినట్లు సమాచారం. అయితే ఈ నిధులు క్షేత్రస్థాయిలో అభ్యర్థులకు చేరకుండా భారీగా మధ్యలోనే గోల్ మాల్ అయ్యా యంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. చాలామంది అభ్యర్థులకు అందాల్సిన ఆర్థిక సాయం విషయంలో కొందరు కీలక నేతలు చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ శ్రేణుల్లో కూడా అసహనం తెప్పిస్తున్నాయి.
అభ్యర్థులకు చేరని డబ్బు
రెండు నెలల కిందట తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో బిజెపి అభ్యర్థులు అన్నిచోట్ల పోటీ చేశారు. కానీ వారికి హై కమాండ్ నుంచి పంపిన నిధులు సరిగ్గా అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హై కమాండ్ కు సైతం ఫిర్యాదులు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్థిక లావాదేవీల్లో జరిగిన పొరపాట్లు, నిధుల వినియోగం పై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించడానికి హైకమాండ్ ఒక ప్రత్యేక దూతను హైదరాబాద్ పంపించినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక నేతలతో సమావేశమైన సదరు నేత నియోజకవర్గాల వారీగా అందిన నిధులు, ఖర్చు చేసిన వివరాలపై ఆరాధిస్తున్నట్లు సమాచారం. లెక్కల్లో తేడాలు వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హై కమాండ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
విభేదాలకు తోడు..
ప్రస్తుతం బిజెపిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. తన వెనుక గొయ్యి తవ్వుతున్నారు అంటూ ఆ మధ్యన ఎంపి ఈటెల రాజేందర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సొంత పార్టీ వారే ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆయనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పడటం లేదు. మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో ఎంపీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ఈటెల రాజేందర్ కోరుతున్నారు. బిజెపిలో జరుగుతున్న పరిణామాలను హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోంది. మొన్న ఆ మధ్యన ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఎంపీలను పిలిచి మాట్లాడారు కూడా. అయినా సరే బిజెపి నేతల వైఖరిలో మార్పు రావడం లేదు. ఇప్పుడు కొత్తగా ఈ నిధుల గోల్ మాల్ వ్యవహారం పార్టీలో హీట్ పెంచుతోంది.
కొట్టి పారేస్తున్న నేతలు..
మరోవైపు ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వార్త ఒట్టిదేనని పార్టీ కీలక నేతలు తేల్చి చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నారు. పార్టీని దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తున్నారు. ప్రతి పైసాకు లెక్క ఉందని వారు వాదిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో డబ్బుల వినియోగంపై ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై స్పష్టతనివ్వాల్సిన అవసరం నాయకత్వంపై ఉంది.
