
BJP New President: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికకు కమలం పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుత అధ్యక్షుడి పదవీకాలం ముగిసినప్పటికీ, పలు కారణాలతో ఎంపిక ఆలస్యం అయ్యింది. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికకు సంబంధించి పార్టీ సీనియర్ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత..
సెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత కొత్త జాతీయ అధ్యక్షుడు ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించనుంది. కొత్త అధ్యక్షుడికి సంబంధించి ఇప్పటికే కొంత మంది పార్టీ నాయకుల పేర్లను అగ్రనాయకులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి పార్టీ అధ్యక్షపదవి మహిళకు ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు బలంగా వినిపిస్తోంది. బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సామాజిక సమీకరణాలను కాకుండా పార్టీని బలోపేతం చేయగలిగే నాయకుడిని సెలెక్ట్ చేయాలని భాఇస్తున్నట్లు తెలుస్తోంది.
జూన్ లోనే ముగిసిన నడ్డా పదవి
ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2019 నుంచి పదవిలో కొనసాగుతున్నారు. ఆయన రెండో టర్మ్ 2024 జూన్ తో ముగిసింది. ప్రస్తుతం ఆయన కేంద్రమంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతల్లో కొనసాగుతున్నారు. త్వరలోనే ఆయన స్థానంలో కొత్త జాతీయ అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంది.