
ఈ మధ్య కాలంలో విమానయాన రంగంలో పక్షుల తాకిడి సమస్య ఆందోళనకర స్థాయికి చేరుతోంది. గాల్లో వేగంగా ప్రయాణిస్తున్న విమానాలను పక్షులు ఢీకొట్టే ఘటనలు వరుసగా వెలుగుచూస్తుండటంతో ప్రయాణికుల్లో భయం నెలకొంటోంది. టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటుండటం విమాన భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
తాజాగా హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో విమానానికి ఇలాంటి అనూహ్య సంఘటన ఎదురైంది. గోవా నుంచి బయల్దేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగానే ఓ పక్షి ఢీకొట్టింది. ఈ విషయాన్ని తక్షణమే గుర్తించిన పైలట్ అప్రమత్తతతో వ్యవహరించి, విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు.
పక్షి తాకిన విషయాన్ని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు తెలియజేయడంతో వెంటనే భద్రతా చర్యలు ప్రారంభమయ్యాయి. ఏటీసీ అధికారుల సూచనల మేరకు సెక్యూరిటీ సిబ్బంది, సాంకేతిక నిపుణులు కలిసి విమానాన్ని సమగ్రంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం ఊరట కలిగించే అంశం. అయితే, ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతుండటంతో విమానాశ్రయ పరిసరాల్లో పక్షుల సంచారం పెరగడంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ల్యాండింగ్ మార్గాల్లో ఆహార వ్యర్థాలు, నీటి నిల్వలు ఉండటమే పక్షులు గుంపులుగా చేరడానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
విమానాలను పక్షులు ఢీకొట్టినప్పుడు తీవ్ర పరిణామాలు సంభవించే అవకాశం ఉందని విమానయాన నిపుణులు హెచ్చరిస్తున్నారు. పక్షులు ఇంజిన్‌లోకి వెళ్లిపోతే ఇంజిన్ బ్లేడ్‌లు దెబ్బతినడం, ఫ్యూయల్ ట్యాంకులకు హాని కలగడం, కాక్‌పిట్ అద్దాలు పగిలే ప్రమాదం కూడా ఉంటుందని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వస్తోంది.
గతంలో దేశంలోని పలు విమానాశ్రయాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పక్షుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని భావిస్తోంది. శబ్ద పరికరాలు, డ్రోన్లు, ప్రత్యేక బృందాల ద్వారా పక్షులను దూరంగా ఉంచే విధానాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణుల సూచన.
ALSO READ: రాజకీయాలను కుదిపేసిన విమాన ప్రమాదాలు.. బలైన నేతలు వీరే..!





