
Bihar Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. జేడీయూతో కలిసి బరిలోకి దిగుతున్న కమలం పార్టీ తాజాగా సీట్ల పంపకాలపై కీలక చర్చలు జరిపింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సమవేశంలో బీహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఎన్నికల్లో సీట్ల పంపకాల ఫార్ములాను ఎన్డీయే ఇంకా ఖరారు చేయకపోవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రస్తుతం బీహార్ లో ఎన్డీయే భాగస్వాములుగా BJP, నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యునైటెడ్(JDU), చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ, జితిన్ రామ్ మాంఝీ హిందుస్తాని అవావీ మోర్చా, ఉపేంద్ర కుష్వాహకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా బరిలోకి దిగుతున్నాయి. 2020 బిహార్ ఎన్నికల్లో జేడీయూపై చిరాగ్ పాశ్వన్ ఎల్జేడీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. అయితే ఈసారి చిరాగ్ పార్టీ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయేకు భాగస్వామిగా ఉంది. గత ఎన్నికల్లో తరహా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో 40 సీట్లను ఎల్జేపీ కోరుకుంటున్నప్పటికీ తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా ఉన్న మాంఝీ తమ హెచ్ఏఎం పార్టీ 35-40 సీట్లలో పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించింది. 243 మంది సభ్యుల అసెంబ్లీలో తమ సభ్యులు కనీసం 20 మంది ఉండేలా చూసుకుంటామన్నారు. 100 సీట్లలో పోటీ చేయాలని జేడీయూ పట్టుదలగా ఉంది. ఆర్ఎల్ఎం సైతం మరిన్ని సీట్లు ఆశిస్తోంది.
ఇక 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 74 సీట్లు గెలుచుకుంది. జేడీయూ 115 సీట్లలో నిలబడి 43 చోట్ల గెలిచింది. ఎల్జేపీ 135 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది. ప్రధానంగా జేడీయూపై అభ్యర్థులను నిలబెట్టింది. అయితే కేవలం ఒకే ఒక్క సీటుని ఎల్జేపీ గెలుచుకుంది. కనీసం 30 చోట్ల జేడీయూ గెలుపు అవకాశాలను ఎల్జేపీ గండికొట్టింది. హెచ్ఏఎం7 సీట్లలో పోటీచేసి 4 గెలుచుకుంది. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ 11 స్థానాల్లో పోటీ చేసి 4 నియోజకవర్గాల్లో గెలిచింది.