
Bihar Intercaste Marriage Incident: బీహార్‌లో దారుణం జరిగింది. తన కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో ఓ తండ్రి ఘోరానికి పాల్పడ్డాడు. కన్న కూతురు ముందే కట్టుకున్న వాడిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన బీహార్ లో సంచలనం కలిగించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
దర్భంగా మెడికల్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తన్నూ ప్రియ.. అదే కాలేజీలో సెకెండ్ ఇయర్ చదువుతున్న రాహుల్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు తమ ప్రేమ పెళ్లిని ఒప్పుకోరని భావించి కొన్ని నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పకుండా వారి వారి హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. తాజాగా ఈ విషయం ప్రియ తండ్రి ప్రేమ్ శంకర్ కు తెలిసింది.
కాలేజీలోనే కాల్చివేత
తన కూతురు కుటుంబ పరువును నాశనం చేసిందన భావించిన శంకర్.. గన్ తీసుకుని కాలేజీకి వెళ్లాడు. తన కూతురు ప్రియ ముందే రాహుల్ కుమార్ ను కాల్చాడు. అతడికి ఛాతిలో బుల్లెట్ తగలడంతో వెంటనే కుప్పకూలాడు. వెంటనే విద్యార్థులు ప్రియ తండ్రిని అడ్డుకున్నారు. వెంటనే రాహుల్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. వెంటనే స్పాట్ కు చేరకున్న పోలీసులు ప్రేమ్ శంకర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.
రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా..
అటు ఈ ఘటనతో ప్రియ షాకైంది. పెళ్లి సమయంలో తమ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించామని, అయినా కూడా ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. అటు రాహుల్‌కు న్యాయం చేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రియ తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో దర్భంగా మెడికల్ కాలేజీ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: 15 ఏళ్లు.. 8 పెళ్లిళ్లు.. తొమ్మిదో పెళ్లి చేసుకుంటుండగా..