Bihar Assembly Results 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయాన్ని అందుకుంది. అంచనాలకు అందని రీతిలో ఏకంగా 200పైగా స్థానాలను సాధించింది. కూటమి నేతలంతా ఐక్యంగా పని చేసిన అద్భుత విజయాన్ని అందుకున్నారు. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఎన్డీయేలోని పార్టీలు బీజేపీ, జేడీయూ గత ఎన్నికలతో పోల్చితే అద్భుత విజయాన్ని అందుకున్నాయి. అదే కూటమికి చెందిన మరో భాగస్వామి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అనూహ్యంగా సత్తా చాటింది.
19 స్థానాల్లో ఘన విజయం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 28 స్థానాల్లో పోటీ చేసింది. అందులో ఏకంగా 19 చోట్ల విజయం సాధించింది. 67 శాతం స్ర్టైక్ రేట్ తో అదరగొట్టింది. ‘యువ బిహారీ’ నేతగా చిరాగ్ గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ నాయకత్వంలో లోక్‌జనశక్తి పార్టీ 2005లో 29 చోట్ల విజయం సాధించింది. ఈ పార్టీ ఏర్పడిన తర్వాత అత్యధిక స్థానాలు గెలవడం ఇదే తొలిసారి.
కష్టాలక కడలి నుంచి విజయ తీరాల వైపు
చిరాగ్ పాశ్వాన్ 2020లో సీఎం నితీశ్ కుమార్‌ను బహిరంగంగా ఆయన వ్యతిరేకించి.. బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నారు. 137 చోట్ల పోటీచేసి ఒక్క స్థానంలోనే విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో సంక్షోభంతో తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ అధికార నివాసాన్నీ, ఆయన పార్టీనీ కోల్పోయారు. చిరాగ్ వేరే పార్టీని పెట్టుకున్నారు. మోడీకి తాను హనుమంతుడినని చెప్పుకొనేవారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 5 స్థానాల్లో పోటీ చేసి 5 సీట్లూ గెలిచారు. రామ్ విలాస్ కు చిరాగ్ తగిన వారసుడని బీజేపీ గుర్తించింది. గత ఏడాది కేంద్ర మంత్రి పదవిని ఇచ్చింది. ఇప్పుడు ఆయన పార్టీ బీహార్ ఎన్నికల్లోనూ చక్కటి విజయాన్ని సాధించింది. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.





